రెండో అంతస్తు పైనుంచి పడి మహిళ మృతి
ఖలీల్‌వాడి(నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ నగర పరిధిలోని బోర్గాం (పి) గ్రామంలో ఓ మహిళ ప్రమాదవశాత్తు రెండో అంతస్తు పైనుంచి పడి మృతిచెందింది. నిజామాబాద్ నాలుగోటౌన్ ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేటకు చెందిన కాలూరి నిహారిక (32)కు బోర్గాం నివాసి విజయ్‌కుమార్‌తో 2007లో వివాహమైంది. వీరికి ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. నిహారికకు కొన్నేళ్లుగా ఆరోగ్యం, మానసికస్థితి బాగాలేదు. మంగళవారం మధ్యాహ్నం దుస్తులు ఆరేయడానికి రెండో అంతస్తు పైకి వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. తీవ్రగాయాలైన ఆమెను స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ మృతిచెందింది. మృతురాలి అన్నయ్య మురళి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment