మళ్లీ కలప దందా | - | Sakshi
Sakshi News home page

మళ్లీ కలప దందా

Published Wed, Jan 8 2025 1:50 AM | Last Updated on Wed, Jan 8 2025 1:50 AM

మళ్లీ

మళ్లీ కలప దందా

● నాలుగేళ్లుగా అజ్ఞాతంలో స్మగ్లర్లు ● ఇటీవల అడవుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా తరలింపు ● దాడులతో సవాల్‌ విసురుతున్న వైనం

ఇచ్చోడ(బోథ్‌): ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ, సిరికొండ కేంద్రాలుగా మళ్లీ కలప దందా షురువైంది. కొన్ని రోజులుగా స్మగ్లర్లు దట్టమైన అటవీప్రాంతంలోని టేకుచెట్లను నరికి రాత్రిపూట స్మగ్లింగ్‌కు

పాల్పడుతున్నారు. వాటిని సైజులుగా మార్చి ద్విచక్ర వాహనాలపై గ్రామాలు, పట్టణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం.

నాలుగేళ్లుగా అజ్ఞాతంలోకి..

జిల్లాలోని అటవీ ప్రాంతాలన్నీ కొన్నేళ్లుగా స్మగ్లర్ల గొడ్డలివేటుకు మైదానాలుగా మారిపోయాయి. దీంతో 2019–20 సంవత్సరంలో అప్పటి సీఎం చంద్రశేఖర్‌రావు కలప దందాను సీరియస్‌గా తీసుకున్నా రు. ‘జంగిల్‌ బచావో...జంగిల్‌ బడావో’ అనే నినా దంతో అడవులను రక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు, అటవీశాఖ సంయుక్తంగా కలప స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపారు. స్మ గ్లింగ్‌కు పాల్పడుతున్న వారిపై పీడీయాక్టు కింద కేసు నమోదు చేశారు. దీంతో కలప స్మగ్లింగ్‌కు బ్రేక్‌ పడింది. నాలుగేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న స్మగ్లర్లు ఇటీవల మళ్లీ గుట్టుచప్పుడు కాకుండా దందాను షురూ చేశారు.

దాడులు కొత్తేమీ కాదు..

కలప అక్రమ దందా చేస్తున్న వారంతా నేర ప్రవృత్తి కలిగిన వారే. గతం నుంచీ కూడా వారికి అడ్డువచ్చిన అటవీశాఖ సిబ్బందిపై దాడులు చేయడం వారికి కొత్తేమీ కాదు. గతంలో అటవీశాఖ సిబ్బందిపై దాడులు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇచ్చోడ, గుడిహత్నూర్‌, నేరడిగొండ, బోథ్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలోని సోన్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, మహారాష్ట్రలోని పాండ్రకొడ, యవత్మాల్‌ పోలీస్‌ స్టేషన్లలో వేల కేసులు నమోదయ్యాయి.

ఇటీవల పట్టుబడిన కలప వివరాలు

● డిసెంబర్‌ 14న సిరికొండ నుంచి ఆదిలాబాద్‌ వైపు ఆటోలో తరలిస్తున్న రూ.60 వేల విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు.

● డిసెంబర్‌ 17న సిరికొండ మండలంలోని బోరింగ్‌గూడలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.2 లక్ష ల విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు.

● డిసెంబర్‌ 24న ఇచ్చోడ మండలంలోని ఎల్లమ్మగూడ అటవీ ప్రాంతంలో దాచి ఉంచిన రూ.30 వేల విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు.

● డిసెంబర్‌ 30న ఇచ్చోడ మండలం హరినాయక్‌తాండ వద్ద ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న రూ.27 వేల విలువైన కలపను పట్టుకున్నారు.

● జనవరి 5న కేశవపట్నంలో కార్డన్‌సెర్చ్‌ నిర్వహించి రూ.3.50 లక్షల విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు.

అటవీశాఖ అధికారులపై దాడులు కొన్ని...

2012లో ఇచ్చోడ మండలంలోని చించోలిలో బ్రిడ్జి వద్ద ఆగిఉన్న అటవీశాఖ వాహనాన్ని కిందకు తోసివేశారు.

2014లో బజార్‌హత్నూర్‌ మండలంలోని డే డ్రా అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు టేకు చెట్లను నరుకుతుండగా సిబ్బందితో కలిసి అడ్డుకునేందుకు వెళ్లిన ఇచ్చోడ అటవీశాఖ అధికా రిపై రాళ్లతో దాడి చేయగా ఎఫ్‌ఆర్వో తలకు తీవ్రగాయాలతో బతికి బయటపడ్డాడు.

2016లో ఇచ్చోడ మండలంలోని మాన్కపూర్‌ వద్ద నిర్మాణంలో ఉన్న చెక్‌పోస్టును ధ్వంసం చేశారు.

2023లో ఇంద్రవెల్లి నుంచి ఐచర్‌ వాహనంలో కలప తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు గుడిహత్నూర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద పట్టుకునే ప్రయత్నం చేశారు. ఐచర్‌ వ్యానుతో అటవీశాఖ సిబ్బందిని ఢీ కొట్టే ప్రయత్నం చేయగా తప్పించుకున్నారు.

2024లో సిరికొండలో అక్రమంగా కలప తరలిస్తున్న ఆటోను పట్టుకోగా స్మగ్లర్లు అటవీశాఖ సిబ్బందిపై దాడిచేసి పరారయ్యారు.

కఠిన చర్యలు తీసుకుంటాం

కలప అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. స్మగ్లింగ్‌ నివారణకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. పెట్రోలింగ్‌ ముమ్మరం చేశాం. అవసరమైతే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – ప్రశాంత్‌

బాజీరావు పాటిల్‌, డీఎఫ్‌వో, ఆదిలాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
మళ్లీ కలప దందా1
1/1

మళ్లీ కలప దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement