ముగిసిన ‘నిర్మల్ ఉత్సవాలు’
వాతావరణం
కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. చలి కొనసాగుతుంది. రాత్రి మంచు కురుస్తుంది.
● సమష్టి కృషితోనే సక్సెస్ ● కలెక్టర్ అభిలాష అభినవ్
మాట్లాడుతున్న కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్: జిల్లా చరిత్ర, సంస్కతి, సంప్రదాయాలను చాటిన నిర్మల్ ఉత్సవాలు విజయవంతం అయ్యాయని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన జిల్లా ప్రజలు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నాలుగు రోజులపాటు నిర్వహించిన ‘నిర్మల్ ఉత్సవాలు–2025‘ బుధవారం రాత్రి అట్టహాసంగా ముగిశాయి. రోజంతా స్టాళ్లు కొనసాగాయి. సాయంత్రం వివిధ విద్యాసంస్థలు, డ్యాన్స్ అకాడమీల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పలువురు కళాకారులు వివిధ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. చివరిరోజు చరిత్ర బోధనలో భాగంగా హిస్టోరియన్ ధోండి శ్రీనివాస్ నిర్మల్ పట్టణ చరిత్రను వివరించారు. సాయంత్రం భారీగా తరలివచ్చిన పట్టణవాసులు, వివిధ మండలాల ప్రజలు స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. స్థానిక వంటకాలను రుచి చూశారు. చిన్నారులు తమ కోసమే ఏర్పాటు చేసిన ఆటల్లో మునిగితేలారు.
వచ్చే ఏడాది మరింత ఘనంగా..
నిర్మల్ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడారు. జిల్లా ప్రజలందరి సమష్టి సహకారంతోనే తొలిసారిగా నిర్మల్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. జిల్లాలో ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తామని, వచ్చే ఏడాది మరింత ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. వేడుకల నిర్వహణకు జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది చాలా కష్టపడ్డారని తెలిపారు. జిల్లా అభివృద్ధి, ఇక్కడ చరిత్ర సంస్కృతి పరిరక్షణకు మరింత శ్రమిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment