షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు నిర్వహించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 26 నుంచి అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి కీలకమైన సంక్షేమ పథకాల అమలుకు మంగళవారం నుండి ఈనెల 24 వరకు నిర్వహించే గ్రామసభల్లో సమయపాలన పాటించాలన్నారు. నిర్లక్ష్యానికి తావు లేకుండా అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డులో అర్హుల జాబితాను ప్రచురించాలని, గ్రామసభల్లో వచ్చే అర్జీలను స్వీకరించాలన్నారు. లబ్ధిదారుల జాబితాను గ్రామసభల్లో చదివి వినిపించాలని, అభ్యంతరాలుంటే దరఖాస్తులు స్వీకరించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, డీపీవో శ్రీనివాస్, డీఎస్వో కిరణ్ కుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment