● మధ్యతరగతికి ఐటీ ఊరట ● కొయ్యబొమ్మకు భరోసా ● పన్ను పరిమ
నిర్మల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జిల్లా వాసుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించినా, ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చినా.. ఈసారి కూడా ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు లేకపోవడం జిల్లా వాసులను నిరాశపరిచింది. వేతన జీవులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆదాయపు పన్ను స్లాబ్ పరిమితి రూ.12 లక్షలకు పెంచడం జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ, వివిధ రంగాల పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చింది. దీనిపై ఆయారంగాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇక ఎప్పటి నుంచో జిల్లా వాసులు ఎదురు చూస్తున్న రైల్వేలైన్ నిర్మాణంపై సందిగ్ధం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం రైల్వేలకు కేటాయింపులు చేసిన తర్వాతనే దీనిపై స్పష్టత రానుంది. ఈ బడ్జెట్లో నిర్మల్ కొయ్య బొమ్మకు కొంత ఊరట దక్కగా, రైతులు, మహిళలకు లబ్ధి చేకూరనుంది
విద్య, వైద్య రంగాలకు...
విద్య, వైద్య రంగాల్లో జిల్లాకు ప్రత్యేకంగా కేటాయింపులు దక్కకపోవడం నిరాశ పర్చింది. ఈసారి బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాల్లోని సెకెండరీ పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే అంగన్‌వాడీలకు కొత్త హంగులు తీసుకురానున్నారు. పోషణ్ అభియాన్ 2.0లో భాగంగా అంగన్‌వాడీల్లో అధునాతన సౌకర్యాలు కల్పించి, మరింత నాణ్యమైన ఆహారం చిన్నారులు, బాలింతలకు అందజేయనున్నట్టు నిర్మల సీతారామన్ తెలిపారు. వైద్యరంగం విషయానికి వస్తే.. అన్ని జిల్లా ఆసుపత్రుల్లో క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఇవి నెలకొల్పుతామన్నారు. ఈ వార్షిక సంవత్సరంలో 200 ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో పెరుగుతున్న క్యాన్సర్ బాధితులకు ఇవి వరంగా మారనున్నాయి. జిల్లాకు కావాల్సిన ట్రామా కేర్ సెంటర్‌పై మాత్రం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.
పేద, మధ్య తరగతికి ఊరట..
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటనిస్తుంది. రూ.12 లక్షల వరకు ఐటీ పరిమితి హర్షనీయం. వికసిత్ భారత్ బడ్జెట్‌లో విద్య, వైద్యం, మహిళ, శిశు సంక్షేమానికి కేంద్రం పెద్దపీట వేసింది.
– పి.రామారావు పటేల్, ఎమ్మెల్యే, ముధోల్
●
నిర్మల్ బొమ్మకు భరోసా..!
రైతులు, మహిళలకు...
భారత్‌ను టాయ్ హబ్‌గా మారుస్తామని కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రసంగంలో హామీ ఇచ్చారు. బొమ్మల కోసం జాతీయ ప్రణాళిక రూపకల్పన చేసినట్టు తెలిపారు. ఈ ప్రకటన ప్రభావం మన నిర్మల్ బొమ్మకు మరింత ప్రాధాన్యత పెంచే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రోత్సాహం లేక అంతరించిపోతుందేమో అన్నట్లుగా మారిన నిర్మల్ కొయ్యబొమ్మలకు ఈ బడ్జెట్ కొంత ఊపిరి పోస్తుందనే చెబుతున్నారు. కేంద్రం ప్రత్యేకంగా నిధులను కేటాయించి బొమ్మల తయారీలోనూ అధునాతన పద్ధతులను తీసుకురావడం, మార్కెటింగ్ పరిధిని పెంచడం చేస్తే బొమ్మలకు భరోసా దక్కుతుందని ఈ పరిశ్రమపై ఆధారపడిన నకాషీ కళాకారులు పేర్కొంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు పంటకు 2 వేల చొప్పున పీఎం కిసాన్ నిధి సహాయాన్ని అందిస్తోంది. ఈసారి బడ్జెట్లో కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా అందజేసే రుణాల పరిమితిని కూడా పెంపునకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. ఈ రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. గత బడ్జెట్‌లో సాగులో యాంత్రీకరణపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఈసారి ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఇక స్వయం సహాయక సంఘాల మహిళలకు క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నారు. గ్రామీణ మహిళలకు ఇది తీపి కబురు అని చెప్పవచ్చు. సంఘాల మహిళలకు గ్రామీణ క్రెడిట్ కార్డులను అందజేయనున్నట్టు మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment