మలిసంధ్యలో మరణ శాసనం!
నిర్మల్‌ఖిల్లా: మలి సంధ్యలో జీవితం ప్రశాంతంగా గడపాలని అందరూ కోరుకుంటారు. పెళ్లి నాటి నుంచి పిల్లలు ప్రయోజకులయ్యే వరకు వారి కోసం కష్టపడిన తల్లిదండ్రులు ఇక విశ్రాంత జీవితం హాయిగా గడపాలనుకుంటారు. అయితే ఈ వయసులో వచ్చే అనారోగ్య సమస్యలకు తోడు.. వృద్ధాప్యం కారణంగా తల్లిదండ్రులను వదిలించుకోవాలనే చాలా మంది చూస్తున్నారు. దీంతో కొడుకులు, కోడళ్ల చీత్కారాలు.. పెరుగుతున్నాయి. వాటిని భరించే ఓపిక ముసలి గుండెలకు ఉండడం లేదు. చీదరింపులు, ఛీత్కారాలు.. అనారోగ్య సమస్యల నడుమ జీవనం సాగించలేమని కొందరు వృద్ధాశ్రమాలకు వెళ్లిపోతున్నారు. కొందరు ఇలా జీవించడం కన్నా.. చావడమే మేలని భావిస్తున్నారు. ఆత్మగౌరవ సమస్యలతో మానసికంగా సంఘర్షణకుగురై తనువు చా లించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అ యితే వృద్ధాప్యంలో సమస్యల కు ఆత్మహత్యలే పరిష్కారం కాదని సంక్షేమశాఖ అధికారులు, మానసిక నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులకు పిల్లలు మానసిక సాంత్వన కల్పించేలా చేయూతనందివ్వాలని సూచిస్తున్నారు.
ఆదరణ లేక..
ప్రేమ, ఆత్మీయతల్లేని సంసారాలు.. ఉద్యోగాల పేరిట దూరమైపోయిన కొడుకు– కోడళ్లు.. గృహసంబంధమైన వివాదాల వల్ల దూరంగా ఉంటున్నవారు.. కారణమేదైనా ఫలితం మాత్రం మలి సంధ్యలో అమ్మా.. అన్న పిలుపుకోసం ‘నాన్నా.. అన్న పలకరింపు కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. కానీ అవే లేకపోవడం, ఆప్యాయత, ప్రేమ, ఆదరణ లభించక భారంగా జీవనం సాగిస్తున్నారు. వృద్ధాప్య సమస్యలు కుంగదీస్తున్నాయి. ఇలాంటి సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అండగా పలు చట్టాలు,హెల్ప్‌లైన్‌లు..
కేంద్ర ప్రభుత్వం 2007లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం తెచ్చింది. దానికి అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వారి సంక్షేమ నియమావళిని రూపొందించాయి. 2019లో ఈ చట్టానికి కేంద్రం మరిన్ని రక్షణ సవరణలు చేసినా, అవి ఇంకా పూర్తిస్థాయిలో అమలులోకి రావాల్సిన అవసరం ఉంది. వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎల్డర్ లైన్ 14567 పేరిట హెల్ప్ లైన్.. వీటిద్వారా పోషణ సంరక్షణ నిరాశ్రయ వృద్ధులకు తగిన సహకారం, చట్టపరమైన తోడ్పాటు, మానసిక భాగోద్వేగాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఇవన్నీ వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు.
కన్నవారికి భారం కాలేక...
అనారోగ్య సమస్యలతో జీవించలేక..
అందరూ ఉన్నా ఒంటరిగా బతకలేమని..
బలవన్మరణానికి పాల్పడుతున్న వృద్ధులు
నిర్మల్‌కు చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు కన్నవారు తనను పట్టించుకోవడంలేదని అక్టోబరులో ఇంటి నుంచి వెళ్లిపోయింది. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మరుసటిరోజు మృతదేహం లభించింది.
సారంగాపూర్ మండలం చించోలి–బికి చెందిన 62 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి తన భార్యతో కలిసి దిలావర్‌పూర్ మండలం కాల్వ సమీప అటవీ ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసున్నాడు. కన్నవారికి భారం కావొద్దని భావించి కఠిన నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment