![‘ప్రత్యేక’మా.. పొడిగింపా?](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/1234_mr-1739130940-0.jpg.webp?itok=I-ZhVBi_)
‘ప్రత్యేక’మా.. పొడిగింపా?
● 14న ముగియనున్న ‘సహకార’ పాలకవర్గాల గడువు ● ఆరు నెలల వరకు ఎన్నికలు అనుమానమే ● పదవీకాలం పొడిగించాలని కోరుతున్న చైర్మన్లు ● స్పెషలాఫీసర్ల నియామకానికి అధికారుల కసరత్తు
కై లాస్‌నగర్: అన్నదాతకు సాగుపరమైన సేవలనందిస్తూ వారికి క్షేత్రస్థాయిలో అండగా నిలుస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల గడువు ఈ నెల 14తో ముగియనుంది. వీటికి ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ జరిగే అవకాశం కనిపించడం లేదు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల మాదిరిగానే ప్రత్యేకాధికారుల పాలన అనివార్యం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం గడువు పొడిగిస్తుందా? లేక ప్రత్యేకాధికారుల పాలనకే గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే సొసైటీల ప్రత్యేకాధికారుల నియామకానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సహకారశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రైతుకు వెన్నుదన్నుగా..
ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు సాగుపరంగా అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంట రుణాలను క్షేత్రస్థాయిలో అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నాయి. పలు సొసైటీలు ధాన్యం కొనుగోళ్లను సైతం చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇవన్నీ ఆదిలాబాద్ కేంద్రంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ), జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్(డీసీఎంఎస్) ఆధ్వర్యంలోనే రైతులకు సేవలందిస్తున్నాయి.
14న ముగియనున్న పదవీకాలం
పీఏసీఎస్‌లకు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహించింది. సొసైటీ పరిధిలో ఎన్నికై న చైర్మన్లతో అదే నెల 25న డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. పలువురు డైరెక్టర్లను సైతం ఎన్నుకున్నారు. ఈ పాలకవర్గాల గడువు ఈ నెల 14తో పూర్తవుతుంది. సాధారణంగా సొసైటీల కాలపరిమితి ముగిసే ఆరు నెలల ముందుగానే ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియ చేపట్టి గడువు వరకు పూర్తిచేసేది. అయితే ప్రస్తుతం వీటి నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీంతో ప్రత్యేకాధికారుల పాలన అనివార్యంగా మారింది. అయితే పలువురు అధికార పార్టీ డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు తమ పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాలకవర్గాల గడువును పొడిగిస్తుందా? లేక ప్రత్యేకాధికారుల పాలనకే ఆసక్తి చూపుతుందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో...
మొత్తం సహకార సంఘాలు 77
డీసీసీబీ 1
డీసీఎంఎస్ 1
సొసైటీల పరిధిలోని సభ్యులు 55,000
Comments
Please login to add a commentAdd a comment