![వడపోత యంత్రాలు - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/19/18bdn51-250073_mr_1.jpg.webp?itok=VzaGjOG7)
వడపోత యంత్రాలు
వర్ని: జిల్లాలోని వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ అవినీతికి మారుపేరుగా మారింది. ఈ ఏఎంసీలో సుమారు రూ. 5 లక్షలు విలువ చేసే కుంభకోణం జరిగింది. పర్యవేక్షించాల్సిన కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వడ్లను జల్లెడ పట్టి చెన్నింగ్ మిషిన్లకు ఉండే 30 మోటార్లు మాయమయ్యాయి. రూ. 16 వేలు విలువ చేసే 30 మోటార్లు మిషిన్ల నుంచి గల్లంతయ్యాయి. 2020లో జిల్లా మార్కెట్ కార్యాలయం నుంచి 40 జల్లెడ పట్టే యంత్రాలు వర్ని మార్కెట్ కమిటీకి వచ్చాయి. అందులో యంత్రాల నుంచి 30 గల్లంతయ్యాయి. వీటితోపాటు యంత్రాలను కూడా అస్తవ్యస్తంగా పడేయంతో పనికిరాకుండా పోయాయి. మార్కెట్ కమిటీ ఆస్తులను కాపాడాల్సిన కార్యదర్శి తనకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం శోచనీయం.
చెక్‌పోస్టులోనే విధులు..
జల్లెడ యంత్రాల నుంచి మోటార్లు పోయిన విషయం వాస్తవమేనని ఎలా పోయాయో తనకు తెలియదని ఆ బాధ్యతను మరో కాంట్రాక్టు ఉద్యోగికి అప్ప జెప్పానని దాటవేయడం కొసమెరుపు. బాధ్యతగల కార్యదర్శి శ్రీనివాస్ ఆరు నెలల నుంచి తాను కార్యాలయానికి సరిగా రావడం లేదని మండల కేంద్రంలో ఉన్న చెక్ పోస్ట్‌లోనే విధులు నిర్వహిస్తున్నానని, కార్యాలయంలో ఏం జరుగుతుందో తనకు తెలియదని సమాధానం ఇవ్వడం బాధ్యత రాహిత్యానికి నిదర్శనం. సుమారు రూ. 5 లక్షల విలువ చేసే మోటర్లను కార్యదర్శి మరికొందరు కలిసి విక్రయించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడేళ్ల క్రితం మార్కెట్ కమిటీలో అగ్ని ప్రమాదం సంభవించి రూ. 16 లక్షల విలువగల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం వెనుక భారీ కుంభకోణం ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విలువైన వస్తువులను అమ్ముకొని అగ్ని ప్రమాదంలో దగ్ధమైనట్లు చూపించారన్న ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్ కమిటీలో జరుగుతున్న అవినీతిపై జిల్లా మార్కెటింగ్ అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సుమారు రూ. 5 లక్షలు విలువ చేసే
30 మోటార్లు మాయం
తనకేమీ తెలియదంటున్న కార్యదర్శి
ఎవరు ఎత్తుకెళ్లారో తెలియదు
మార్కెట్ కమిటీలో ఉన్న 30 వడపోత యంత్రాల మోటార్లు ఎలా మాయమయ్యాయో తెలీదు. నేను మార్కెట్ కమిటీ చెక్ పోస్ట్‌లోనే ఉంటున్నాను. కార్యాలయంలో ఏం జరుగుతుందో తెలీదు.
– శ్రీనివాస్, వర్ని మార్కెట్ కమిటీ కార్యదర్శి
ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం
వర్ని ఏఎంసీలో మోటార్లు మాయమైన విషయం తన దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి బాధ్యులపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.
– గంగు, జిల్లా మార్కెటింగ్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment