సజ్జ సాగుకే మొగ్గు..
మోర్తాడ్(బాల్కొండ): విత్తన పంటల సాగులో ముందుండే జిల్లా రైతులు పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. గడచిన యాసంగి సీజనులో, అంతకు ముందు సజ్జ సాగును తగ్గించి నువ్వుల పంటకు ప్రాధాన్యం ఇచ్చిన రైతులు ఇప్పుడు మనసు మార్చుకున్నారు. అనుకూలమైన వాతావరణం, భూగర్బ జలాలు సమృద్ధిగా ఉండటంతో సజ్జ సాగుకు మొగ్గుచూపుతున్నారు. క్వింటాలు సజ్జలకు రూ.6 వేల నుంచి రూ.8,300 ధర చెల్లించడానికి వ్యాపారులు ముందుకు వస్తున్నారు. పసుపు తవ్వకాలు మొదలు కావడంతో ఆ వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు సజ్జల సాగుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో సజ్జ లేదా నువ్వుల పంటను సాగు చేసేవారు. కొన్నేళ్ల నుంచి సజ్జలకు తగిన ధర లేకపోవడంతో నువ్వుల సాగుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఒకప్పుడు 30 వేల ఎకరాల్లో సజ్జలు సాగు చేయగా కొన్నేళ్ల నుంచి 10 వేల ఎకరాలకే పరిమితమైంది. సజ్జలకు క్వింటాలుకు రూ.4,600 మాత్రమే ధర పలకడంతో రైతులు సాగు విస్తీర్ణం కుదించారు. ఇప్పుడు సజ్జలకు కొంత ధర పెరగడంతో ఈ రకం పంటనే సాగు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఎర్రజొన్నల సాగు తగ్గడంతో గడ్డి విత్తనాలకు కొరత ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీడ్ కంపెనీలు సజ్జల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నాయి.
ధర ఒప్పందంతో పాటు బైబ్యాక్ ఒప్పందాలకు సీడ్ వ్యాపారులు రైతులకు రాతపూర్వకంగా హామీ పత్రాలను రాసి ఇస్తున్నారు. వచ్చే నెలలో సజ్జల సాగు మొదలయ్యే అవకాశం ఉండటంతో గ్రామాలలో పంట ధర, ఇతర ఒప్పందాలు జోరుగా సాగుతున్నాయి.
రైతులతో ధర, బైబ్యాక్ ఒప్పందాలకు ముందుకు వస్తున్న సీడ్ వ్యాపారులు
క్వింటాలుకు రూ.6వేల నుంచి రూ.8,300 వరకు ధర
గతంలో కంటే ధర తగ్గింది..
సజ్జలకు గతంలో కంటే ధర చాలా తగ్గింది. కానీ రైతులు సాగునీటి లభ్యత ఉండటంతో సజ్జ పంటను సాగు చేయాలని ఆలోచన చేస్తున్నారు. వ్యాపారులతో ధర, బైబ్యాక్ ఒప్పందం చేసుకుంటున్నారు. ధర తగ్గినా దిగుబడి పెరిగితే కొంతైనా ప్రయోజనం కలుగుతుంది.
– కె చిన్న రాజేశ్వర్, రైతు, మోర్తాడ్
Comments
Please login to add a commentAdd a comment