ప్రధాని పర్యటనకు పటిష్ట బందోబస్తు | Sakshi
Sakshi News home page

ప్రధాని పర్యటనకు పటిష్ట బందోబస్తు

Published Wed, May 8 2024 5:25 AM

ప్రధాని పర్యటనకు పటిష్ట బందోబస్తు

పోలీస్‌ కమిషనర్‌ రామకృష్ణ

విజయవాడస్పోర్ట్స్‌/గన్నవరం: ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడలో బుధవారం పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశామని

ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషర్‌ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా ఆంధ్రా లయోల కాలేజీలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీసు అధికారులు, సిబ్బందికి సీపీ దిశానిర్దేశం చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు, పాత పీసీఆర్‌ జంక్షన్‌ నుంచి బెంజిసర్కిల్‌ వరకు రెడ్‌జోన్‌గా ప్రకటిస్తున్నామని సీపీ రామకృష్ణ తెలిపారు. ఈ ప్రాంతాల్లో డ్రోన్లు, బెలూన్లను ఎగురవేయడం నిషిద్ధమని హెచ్చరించారు. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ఏరియా డామినేషన్‌, రోడ్‌ ఓపెనింగ్‌ పార్టీస్‌, కట్‌ ఆఫ్‌ పార్టీస్‌, రూఫ్‌ టాప్స్‌, రోప్‌ పార్టీస్‌, యాంటీ సబ్‌ టేజ్‌ చెక్‌ తదితర బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఆరుగురు పోలీసు ఉన్నతాధికారుల నేతృత్వంలో ఏడుగురు డీసీపీలు/ఎస్పీ, 22 మంది ఏడీసీపీలు, 50 మంది ఏసీపీలు, 136 మంది సీఐలు, 250 మంది ఎస్‌ఐలతో పాటు ఐదు వేల మంది పోలీస్‌ సిబ్బందికి విధులు కేటాయించామని తెలిపారు. వారు నిర్దేశించిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని, అనుమానితులు తారసపడితే వెంటనే అదుపులోకి తీసుకోవాలని, అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. రోడ్‌ షో జరిగే ప్రాతంలో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. ప్రధాని మోదీ రోడ్‌షోలో ప్రజలు పాల్గొనేలా ఐరన్‌ బారిగేడ్లు ఏర్పాటుచేశామని వివరించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ ఎంజీ రోడ్డు వరకు పూర్తి పోలీస్‌ నిఘా ఉంటుందన్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల రాకపోకలను దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్‌ ఆంక్షలు మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అమలులో ఉంటాయని వివరించారు. ఈ సమావేశంలో ఐజీపీ కె.వి.మోహన్‌రావు డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, ఏఐజీలు ఎం.రవీంద్రనాథ్‌బాబు, వకుల్‌ జిందాల్‌, మల్లికా గార్గ్‌, ఏ.ఆర్‌.దామోదర్‌, డీసీపీలు కె.శ్రీనివాసరావు, అధిరాజ్‌సింగ్‌ రాణా, ఉదయరాణి, కరీముల్లా షరీఫ్‌, కె.చక్రవర్తి, టి.హరికృష్ణ, బి.రామకృష్ణ పాల్గొన్నారు.

ఎస్‌ఎస్‌జీ దళాల ఆధీనంలో విమానాశ్రయం

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గాన విజయవాడలో జరిగే రోడ్‌షోలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌ఎస్‌జీ దళాలు విమానాశ్రయాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. రోడ్‌షో అనంతరం ప్రధాన మంత్రి తిరిగి విమానాశ్రయానికి చేరుకుని న్యూఢిల్లీ బయలుదేరి వెళ్తారు.

ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా..

● బుధవారం మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆర్టీసీ వై జంక్షన్‌ నుంచి బెంజిసర్కిల్‌ వరకు ఎంజీ రోడ్డుపై ఎలాంటి వాహనాలనూ అనుమతించరు.

● ఆటోనగర్‌ వైపు నుంచి బస్టాండ్‌ వైపు వెళ్లే వాహనాలు ఆటోనగర్‌ గేటు, పటమట, కృష్ణవేణి స్కూల్‌ రోడ్డు, స్క్యూ బ్రిడ్జి, కృష్ణలంక మీదుగా ప్రయాణించాలి.

● ఎంజీ రోడ్డుపై ప్రయాణించే వాహనాలను ఏలూరు రోడ్డు, ఐదో నంబర్‌ రూట్‌కు మళ్లిస్తారు.

● మచిలీపట్నం – విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులు ఆటోనగర్‌ గేటు, మహానాడు రోడ్డు, రామవరప్పాడు రింగ్‌, ఏటూరు రోడ్డు, పడవల రేవు, బీఆర్టీఎస్‌ రోడ్డు, సీతన్నపేట గేట్‌, ఏలూరు లాకులు, పాత గవర్నమెంట్‌ ఆసుపత్రి మార్గాన్ని అనుసరించాలి.

● ఏలూరు–విజయవాడ మధ్య ప్రయాణించే ఆర్టీసీ బస్సులు రామవరప్పాడు రింగ్‌, పడవలరేవు, బీఆర్టీఎస్‌ రోడ్డు, సీతన్నపేట గేట్‌, ఏలూరు లాకులు, పాతగవర్నమెంట్‌ ఆసుపత్రి మార్గంలో రాకపోకలు సాగించాలి.

● విశాఖపట్నం – హైదరాబాద్‌ మధ్య రాకపోకలు సాగించే భారీ వాహనాలు హనుమాన్‌జంక్షన్‌, తిరువూరు, మైలవరం, ఇబ్రహీంపట్నం మార్గాన్ని అనుసరించాలి.

● విశాఖపట్నం – చెన్నయ్‌ మధ్య ప్రయాణించే భారీ వాహనాలు హనుమాన్‌జంక్షన్‌, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, పులిగడ్డ, రేపల్లె, బాపట్ల, త్రోవగుంట మార్గాన్ని అనురించాలి.

Advertisement
Advertisement