దుర్గమ్మకు గాజుల శోభ | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు గాజుల శోభ

Published Mon, Nov 4 2024 1:10 AM | Last Updated on Mon, Nov 4 2024 1:10 AM

దుర్గ

దుర్గమ్మకు గాజుల శోభ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక శుద్ధవిదియ (యమ ద్వితీయ)ను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను ఆదివారం గాజులతో అలంకరించారు. విశేష అలంకారంలో అమ్మను దర్శించి తరించేందుకు అశేష భక్తజనం ఇంద్రకీలా ద్రికి తరలివచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక నుంచి భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ, విశేష అలంకరణ, నిత్య పూజల అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. రంగురంగుల గాజులతో అమ్మవారు దేదీప్యమానంగా వెలిగిపోతూ భక్తులను కరుణించారు. మూల విరాట్‌ తో పాటు అమ్మవారి ప్రధాన ఆలయం, మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని గాజులతో అలంకరించారు.

గాజుల రంగుల విశిష్టత

అమ్మవారిని అలంకరించిన గాజుల రంగులకు ఓ విశిష్టత ఉందని ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. ఆకుపచ్చ రంగు అదృష్టాన్ని, నీలం విజ్ఞానాన్ని, ఎరుపు శక్తిని, ఉదా స్వేచ్ఛని, నలుపు అధికారాన్ని, నారింజ విజయాన్ని, పసుపు సంతోషాన్ని, తెలుపు ప్రశాంతతను, వెండి గాజులు బలాన్ని, బంగారు గాజులు ఐశ్వరాన్ని అందిస్తాయని వివరించింది. అమ్మవారికి, ఆలయ అలంకరణకు సుమారు రెండున్నర లక్షల గాజులను వినియోగించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ గాజులను భక్తులు విరాళాలు, కానుకలుగా సమర్పించారని పేర్కొన్నారు. అలంకరణ వినియోగించిన గాజు లను త్వరలో భక్తులకు పంపిణీ చేస్తామన్నారు.

కిటకిటలాడిన క్యూలైన్లు

తెల్లవారుజాము నుంచే భక్తులతో ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. హైదరాబాద్‌, బెంగళూరు, వైజాగ్‌ వంటి మహా నగరాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. భక్తుల వాహనాలతో హెడ్‌వాటర్‌ వర్క్స్‌, సీతమ్మ వారి పాదాలు, కెనాల్‌ రోడ్డు పరిసరాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఘాట్‌రోడ్డులో ఎక్కడ చూసినా ద్విచక్ర వాహనాలే కనిపించాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆలయ ప్రాంగణంలో ఏకరీతిన రద్దీ కనిపించింది. రద్దీతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా లక్ష్మీగణపతి విగ్రహం వద్ద రూ.500, రూ.300 టికెట్లకు ప్రత్యేక క్యూలైన్లు, ఆలయం లోపల నుంచి బయటకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈఓ రామరావు పలు మార్లు క్యూలైన్లను పర్యవేక్షించి, సిబ్బందికి సూచనలు అందించారు.

మల్లేశ్వరస్వామి సన్నిధిలోనూ రద్దీ

కార్తిక మాసం కావడంతో ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి, విశేషంగా పూజలు జరిపించుకున్నారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ సేవలు వైభవంగా జరిగాయి. సంధ్యాసమయంలో మల్లేశ్వర స్వామి ఆలయం, అమ్మవారి ఆలయం, నటరాజ స్వామి వారి ఆలయాల్లో ఆకాశదీపాలను వెలిగించారు.

గాజుల అలంకరణతో దర్శనమిచ్చిన అమ్మవారు అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు కేశఖండనశాల వద్ద వసతులు లేక భక్తుల ఇక్కట్లు

కేశఖండన శాల వద్ద భక్తుల ఇక్కట్లు

కేశఖండనశాల వద్ద సరైన సదుపాయాలు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం అమ్మవారికి తలనీలాలు సమర్పించేందుకు భక్తులు భారీగా వచ్చారు. కేశఖండన శాల భవనం వద్ద క్యూ లైన్లపై ఎటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో ఎండలో నిల్చోలేక చిన్న పిల్లల తల్లిదండ్రులు ఇబ్బందులు ఇబ్బంది పడ్డారు. శుక్రవారం, శనివారం, ఆదివారం గంటల తరబడి ఎండలో భక్తులు ఇబ్బందులకు గురయ్యారని కేశఖండన శాల సిబ్బంది తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
దుర్గమ్మకు గాజుల శోభ1
1/1

దుర్గమ్మకు గాజుల శోభ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement