పెళ్లి రిజిస్ట్రేషన్‌కూ తిప్పలే !
లబ్బీపేట(విజయవాడతూర్పు): పెళ్లి రిజిస్ట్రేషన్ ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. అంతేకాదు ఖర్చుతో కూడుకున్న అంశంగా తయారైంది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500లే ఉన్నా, మధ్యవర్తులు రూ.వేలల్లో తీసుకుంటున్నారు. దీంతో పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ల కోసం పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ కార్డులో భార్య ఇంటిపేరు మార్చడం, కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసేందుకు ఇప్పుడు పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా మారింది. అంతేకాదు భర్త ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగి అయితే, పీఎఫ్, ఈఎస్‌ఐ రికార్డుల్లో భార్య పేరు ఎక్కించేందుకు కచ్చితంగా ఇంటిపేరు మార్చాలని చెబుతున్నారు. ఇలా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు నిబంధనలతో పాటు, రూ.వేలల్లో తీసుకోవడంతో ఆర్థిక భారంతో చేయించుకోలేని స్థితి నెలకొంది.
ఇబ్బందులు ఇలా..
● సింగ్‌నగర్‌కు చెందిన వెంకట్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వెంకమ్మలకు గతేడాది అక్టోబరులో విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెళ్లి జరిగింది. ఇప్పుడు వాళ్లు రిజిస్ట్రేషన్ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సెప్టెంబరులో వచ్చిన వరదల్లో వారి పెళ్లి ఫొటోలు అన్నీ తడిసిపోయాయి. కార్డులు కూడా లేవు. దీంతో మధ్యవర్తులను సంప్రదిస్తే రూ.5 వేలు అడుగున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డు కోసం వెళితే పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అడుగుతున్నట్లు చెబుతున్నారు.
● మధురానగర్‌కు చెందిన శ్రావణ్, కంకిపాడుకు చెందిన మాధురిని ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు రేషన్ కార్డు కోసం వెళితే పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అడుగుతున్నారని, రిజిస్ట్రేషన్‌కు వెళితే రూ.3 వేలు అడుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎంతో మంది నిత్యం మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌ల కోసం తిరుగుతున్నారు.
రిజిస్ట్రేషన్ నిబంధనలు ఇలా..
హిందూ పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే భార్య, భర్త తరఫున ముద్రించిన వెడ్డింగ్ కార్డులు, వయసు నిర్థారణ ధ్రువపత్రాలు,(10వ తరగతి మార్కుల లిస్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్‌లలో ఏదొకటి), పెళ్లి కల్యాణ మండపంలో జరిగితే సంబంధిత రసీదు, పెళ్లి ఫొటోలు జీలకర్ర బెల్లం పెట్టేవి, తాళి కట్టేవి, పెద్దలు ఆశీర్వదించే ఫొటోలు, భార్య భర్తలతో పాటు, మరో ముగ్గురు ఆధార్ కార్డులు ఉండాలి. పెళ్లి జరిగి రెండు నెలలు దాటితే రూ.10ల స్టాంప్‌పేపర్‌పై అఫిడవిట్ సమర్పించాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500లు ఆన్‌లైన్‌లో చెల్లిస్తే స్లాట్ బుక్ అవుతుంది. ఆ తేదీన వెళితే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇలా చేసినా మధ్యవర్తులు రూ.3,500ల నుంచి రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. అంతేకాదు వయసు ధ్రువీకరణపత్రం లేకుంటే దానికోసం మరో రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ లేని వారికి రిజిస్ట్రేషన్ పెద్ద సమస్యగా మారింది.
క్రిస్టియన్ మ్యారేజీకి మరింత ఇబ్బంది
క్రిస్టియన్ మ్యారేజీ చేసుకున్న వారు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. అందుకోసం పెళ్లి సమయంలో పాస్టర్ ఇచ్చిన సర్టిఫికెట్‌లు, పెళ్లి ఫొటోతో పాటు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పాస్టర్ పంపిన లిస్టు ఫొటోస్టాట్ పెట్టాలి. చాలా మంది పెళ్లి చేసిన తర్వాత ఆ లిస్టులను జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపడం లేదు. దీంతో క్రిస్టియన్ పెళ్లి రిజిస్ట్రేషన్‌కు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కుదరని వాళ్లు డబ్బు ఖర్చు చేసి స్పెషల్ మ్యారేజీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి కూడా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు.
ప్రతి పనికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌తో ముడి రేషన్ కార్డు, భార్య ఇంటిపేరు మార్పు తప్పనిసరి రిజిస్ట్రేషన్‌కు రూ.3,500 పైనే వసూలు చేస్తున్న మధ్యవర్తులు
నిబంధనలు సులభతరం చేయాలి..
ప్రస్తుతం అన్నింటికీ వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అడుగుతున్నారు. ముఖ్యంగా పేదలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసేందుకు అవసరమవుతుంది. దీంతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి పెళ్లి రిజిస్ట్రేషన్‌లో ఉన్న నిబంధనలను సులభతరం చేయాలి.
– వడ్లమూడి సంపత్, మొగల్రాజపురం
Comments
Please login to add a commentAdd a comment