● ప్రాణాలను బలిగొంటున్న డయాబెటిక్ న్యూరోపతి ● చాలా మ
లబ్బీపేట(విజయవాడతూర్పు): మధుమేహాంతో పాటు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స పొందే వారు న్యూరోపతి సమస్యతో సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు గురవుతున్నారు. అత్యధిక శాతం మంది మధుమేహ బాధితులే న్యూరోపతికి గురవుతున్నారు. మందులు వాడుతూ మధుమేహం వ్యాధిని అదుపులో ఉంచుకోకుంటే ప్రాణాలకు ప్రమాద కరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విజయవాడ నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు నిత్యం వంద మందికిపైగా బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటుకు గురైన వారు వస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. వారిలో 30 నుంచి 40 ఏళ్ల వయస్సు వారు కూడా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు అదుపులో లేని మధుమేహమే కారణమని వైద్యులు వివరిస్తున్నారు.
ఇవీ కారణం..
● మధుమేహ బాధితుల్లో గుండె, మొదడు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ గడ్డలు ఏర్పడతాయి. దీంతో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడి స్ట్రోక్‌కు గురవుతుంటారు.
● మధుమేహం అదుపులో లేని వారిలో రక్తం గడ్డ కట్టే గుణం ఉంటుంది. అలాంటి గడ్డలు రక్తప్రసరణకు అడ్డువచ్చి స్ట్రోక్‌కు కారణం అవుతుంది.
● మధుమేహ రోగులకు రక్తనాళాలు సన్నబడటం, బిగుతుగా మారడం కారణంగా రక్తప్రసరణ సరిగ్గా జరగక స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు స్ట్రోక్ వచ్చిన విషయం కూడా వారి తెలియదు.
ఏమి చేయాలంటే..
● క్రమం తప్పకుండా మందులు వాడుతూ మధుమేహం వ్యాధిని అదుపులో ఉంచుకోవాలి.
● జీవనశైలిని మార్చుకుని వ్యాయామం, యోగా వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
● మద్యం, సిగరెట్ తాగే అలవాటు ఉన్న మధు మేహ బాధితులు వాటికి దూరంగా ఉండాలి.
● ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి
● అవసరమైతే వైద్యుల సూచన మేరకు రక్తం పలచబడే మందులు వాడాలి.
బ్రెయిన్ స్ట్రోక్
జాగ్రత్తలు ముఖ్యం
మధుమేహ బాధితులు దుష్ఫలితాలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. క్రమం తప్పకుండా మందులు వాడాలి. చాలా మంది ఒకసారి వైద్యుడు రాసిన మందులనే నెలల పాటు వాడుతారు. అది మంచిది కాదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి షుగర్ లెవల్స్ పరీక్ష చేయించుకోవడం ద్వారా మందుల పనితీరు తెలుసుకోవచ్చు. అవసరమైతే వైద్యులు మందులు మార్చడం, డోసు పెంచడం, తగ్గించడం చేస్తారు. సక్రమంగా మందులు వాడటం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకుంటే స్ట్రోక్ ముప్పును తప్పించుకోవచ్చు.
– డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణుడు, విజయవాడ
చిన్న వయస్సులోనే బ్రెయిన్ స్ట్రోక్
ఇటీవల 30, 40 ఏళ్ల వయస్సులో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వారిని చూస్తున్నాం. వారిలో మధుమేహ బాధితులు కూడా ఉంటున్నారు. అదుపులో లేని మధు మేహం బ్రెయిన్ స్ట్రోక్‌కు దారి తీస్తోంది. రక్తనాళాలు కుచించుకుపోవడం, కొలెస్ట్రాల్, రక్తం గడ్డలు మొదడు రక్తప్రసరణపై ప్రభావం చూపుతాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడంతో పాటు, కొలెస్ట్రాల్, రక్తం పలచబడే మందులను వైద్యుల సూచన మేరకు వాడాలి. సక్రమంగా మందులు వాడటం, ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం ద్వారా స్ట్రోక్ ముప్పును తప్పించుకోవచ్చు.
– డాక్టర్ చేకూరి మురళీ, న్యూరాలజిస్ట్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment