కదం తొక్కిన కార్మికులు, కర్షకులు
● స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి ● కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి ● రైతు, కార్మిక సంఘాల నేతల డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యాన మంగళ వారం విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహించారు. తుమ్మల పల్లి కళాక్షేత్రం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన బందరు రోడ్డు మీదుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం వరకు సాగింది. అనంతరం జరిగిన సభలో రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కౌలుదారులతో సహా వాస్తవ సాగుదారులందరికీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు అందించాలన్నారు. కేరళ తరహాలో రైతులకు రుణ విమోచన చట్టం చేయాలని, ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, సీఐటీయూ కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా కనీస వేతనాన్ని రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని, ఉద్యోగ విరమణ చేసిన వారికి రూ.10 వేల కనీస పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆటో, హమాలీ, ట్రాన్స్‌పోర్ట్, భవన నిర్మాణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే చట్టాలను అమలు చేయాలని, స్కీం వర్కర్లు అయిన అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనం, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, కార్మికులను రెగ్యులర్ చేయాలని, గ్రాడ్యుటీ, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ప్రజలపై విద్యుత్ భారాలు పెంచే విద్యుత్ చట్టం–2023ను రద్దు చేయాలన్నారు. సభ అనంతరం 22 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపాలని విజ్ఞప్తి చేశారు. రైతు, కార్మిక సంఘాల నాయకులు వై.కేశవరావు, కె.వి.వి.ప్రసాద్, జి.కోటేశ్వరరావు, పి.పోలారి, పి.ప్రసాద్, సుధీర్, కె.ఉమా మహేశ్వరరావు, సుబ్బరావమ్మ, పోలవరపు కృష్ణ, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment