సంప్రదాయ పోటీలు నిర్వహించడం ఆదర్శనీయం
ఘంటసాల: సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఘంటసాలలో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి వృషభాల పూటీ లాగుడు ప్రదర్శనలు నిర్వహించడం ఆదర్శనీయమని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. మన ఊరు – మన సంక్రాంతి సంబరాల్లో భాగంగా డాక్టర్ గొర్రెపాటి నవనీతకృష్ణ మెమోరియల్ ఆధ్వర్యంలో మండల కేంద్రం ఘంటసాల జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో ఒంగోలు జాతి వృషభాల నాటుబండి, రాష్ట్రస్థాయి పూటీ లాగుడు బలప్రదర్శనల పోటీలను కొనకళ్ల నారాయణరావు.. గొర్రెపాటి విద్యాట్రస్ట్ అధినేత, ఎన్నారై గొర్రెపాటి రంగనాఽథ బాబుతో కలసి రిబ్బన్ కత్తిరించి ప్రదర్శన ప్రాంగణాన్ని, శ్రీకాకుళం డీసీ చైర్మన్ అయినపూడి భాను ప్రకాష్‌తో కలసి పూటీ లాగుడు ప్రదర్శనను సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ వ్యవసాయ పనులు ముగించుకుని పశుపోషకులను ప్రోత్సహించేందుకు, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించేలా జరుగుతున్న వృషభ రాజముల పూటీలాగుడు ప్రదర్శనలు విజయవంతంగా నిర్వహించాలన్నారు. అనంతరం టీడీపీ బీసీసెల్ నేత కొనకళ్ల జగన్నాథరావు (బుల్లయ్య), ఎన్నారై రంగనాథబాబు, టీడీపీ నేతలు పరుచూరి సుబాష్ చంద్రబోస్, ముమ్మనేని నాని, మోర్ల రాంబాబు, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తదితరులను కమిటీ సభ్యులు సన్మానించారు. అనంతరం ఘంటసాల గ్రామానికి చెందిన గొర్రెపాటి రీతన్య, రావి చైతన్య ప్రియ, మేఘన ప్రియ కంబైండ్ జతను ఎగ్జిబిషన్ పూటీ లాగుడు పోటీలను ప్రారంభించారు. ప్రదర్శన కమిటీ సభ్యులు బండి పరాత్పరరావు, వేమూరి రాజేంద్ర ప్రసాద్, కన్నెగంటి లక్ష్మీ నారాయణ, కాకుమాని రంగారావు, దోనేపూడి రవిశంకర్, వాసు, గొర్రెపాటి చంటి బాబు, గొర్రెపాటి సురేష్, బాషా, సుదర్శన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
గార్లపాడు ఎంపీపీ రామినేని శ్రీనివాసరావు ఎడ్లజతకు ప్రథమ స్థానం
ఒంగోలు జాతి రాష్ట్రస్థాయి పూటీ లాగుడు పోటీలు సోమవారం హోరా హోరీగా సాగాయి. న్యూ జూనియర్స్ విభాగం పోటీల్లో 15 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడు గ్రామానికి చెందిన ఎంపీపీ రామినేని శ్రీనివాసరావు ఎడ్ల జత 2 క్వింటాళ్ల బరువును 10 నిమిషాల్లో 3,423 అడుగుల దూరం లాగి మొదటి స్థానం సాధించగా, ఎన్టీఆర్ జిల్లా వత్సవాయికి చెందిన కె.ప్రభాకర్ రెడ్డి ఎడ్ల జత 3,307.7 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. 3,023 దూరం లాగిన బాపట్ల జిల్లా చోపిరాలకు చెందిన చెరుకూరి సంధ్య ఎడ్లు తృతీయ స్థానం, 2,824 దూరం లాగిన పెదపూడికి చెందిన ఆళ్ల హరికృష్ణయాదవ్ ఎడ్లు నాలుగో స్థానం, 2,776 దూరం లాగిన కృష్ణాజిల్లా చినపులిపాకకు చెందిన ఆర్‌వీఎల్స్ బుల్స్ జత ఐదో స్థానం, 2,634 అడుగుల దూరం లాగిన కె కొత్తపాలెంకు చెందిన కొల్లి చరితశ్రీ ఎడ్లు ఆరో స్థానం సాధించాయి. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఎడ్ల జత యజమానులకు మెమెంటోలు అందించారు. మంగళవారం ఉదయం ఒంగోలు జాతి ఆవుల అందాల పోటీలు, మధ్యాహ్నం జూనియర్స్, సీనియర్స్ విభాగంలో పూటీ లాగుడు బల ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment