![సంబరాలు జరుపుకుంటున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/9/08krp143a-370017_mr_0.jpg.webp?itok=IZ3Q6AY0)
సంబరాలు జరుపుకుంటున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
పార్వతీపురం: మండలంలోని డీకేపట్నం పంచాయతీలో గల బోడికొండలోని గ్రానైట్‌ను లీజుకు ఇచ్చేందుకు గత టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నంపై వైఎస్సార్‌సీపీ నాయకుడు జమ్మాన ప్రసన్నకుమార్ గిరిజనుల తరఫున పోరాటం చేశారు. ఈ పోరాటంలో జమ్మాన ప్రసన్న కుమార్‌ను ప్రథమ ముద్దాయిగా చేస్తూ మరో 29మందిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం 2017లోక్రిమినల్ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి దాదాపు ఏడేళ్లు సుదీర్ఘ కాలం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి కోర్టులో కేసు కొనసాగింది. జమ్మాన ప్రసన్నకుమార్ తరఫున న్యాయవాది డి. శాంతిరాజు ఈ కేసును వాదించారు. ఈ కేసులో వాదోపవాదాలు పూర్తయిన తరువాత జమ్మాన ప్రసన్నకుమార్‌ను నిర్దోషిగా గుర్తించి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బుధవారం తీర్పునిచ్చారు.
సంతోషంగా బాణసంచా కాల్చివేత
దాదాపు 15వేల గిరిజన కుటుంబాల హక్కుల కోసం వైఎస్సార్‌సీపీ పార్వతీపురం సమన్వయకర్తగా అప్పట్లో ఉన్న జమ్మాన ప్రసన్నకుమార్‌తో పాటు సీపీఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి తదితరులపై అప్పటి టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులను నమోదు చేసింది. కేసు విచారణ జరుగుతుండగానే సీపీఎం నాయకుడు రెడ్డి శ్రీరామ్మూర్తి, మరో ఇద్దరు స్వర్గస్తులయ్యారు. దాదాపు ఏడేళ్లపాటు కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో జమ్మాన ప్రసన్నకుమార్‌తోపాటు మిగిలిన వారిపై ఉన్న కేసును కొట్టివేస్తూ నిర్దోషులుగా ప్రకటిస్తూ బుధవారం తీర్పు వెలువడడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఏపీ టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ మాట్లాడుతూ పోరాటానికి నైతిక మద్దతు తెలిపిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం రాజన్నదొర, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణితోపాటు పలువురు తనకు మద్దతు తెలిపారని చెప్పారు. ఈ సందర్భంగా గిరిజనులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
హర్షం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
Comments
Please login to add a commentAdd a comment