![వ్యాధుల నుంచి ప్రజలను కాపాడాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12ors32a-280025_mr-1739413411-0.jpg.webp?itok=LDPS7Y-0)
వ్యాధుల నుంచి ప్రజలను కాపాడాలి
● ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి
జయపురం: డెంగీ, మలేరియా తదితర వ్యాధుల నుంచి గ్రామీణ ప్రజలను కాపాడడంతోపాటు వారిలో చైతన్యం తీసుకురావాలని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అభిప్రాయపడ్డారు. జయపురం సమితి రమణగుడలోని కమ్యూనిటీ ఆస్పత్రిలో బుధవారం నిర్వహించిన రోగి కళ్యాణ సమితి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేటట్లు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో మలేరియా జ్వరాలు విస్తరిస్తున్న నేపథ్యంలో నివారం చర్యల్లో భాగంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. గత నాలుగేళ్ల నుంచి ప్రజలకు దోమతెరలు సరఫరా చేయడం లేదని.. ఈసారైనా సరఫరా చేయాలని బాహిణీపతి సూచించారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలని, అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అవసరమైన మందులతో పాటు టీటీ ఇంజక్షన్‌లు ఉంచాలన్నారు. పిల్లల ఆరోగ్యంపై డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రతి గ్రామానికి సంచార వైద్య వాహనాన్ని పంపించాలన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. కాగా ఈ ఏడాది 81 వేల మందికి మందుతో కూడిన దోమతెరలు పంపిణీ చేయాలని నిర్ణయించిందని సమావేశంలో జయపురం సమితి అధ్యక్షురాలు తిలోత్తమ ముదులి, ఆస్పత్రి వైద్యధికారి డాక్టర్ శ్వస్థిక్ మహల్ వెల్లడించారు. సమావేశంలో బీపీఎం దీపాన్విత పట్నాయక్, బీఏఎం హిమాంశు మిశ్ర, ప్రజా వైద్యాఽఽధికారి ధరిత్రీ ముదులి, సీడీపీవో కంజన పండ, ఏబీఈవో ప్రియంబిత పాత్రో, సమితి సభ్యులు కును గౌఢ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment