దానా తుఫాన్ బాధితులకు విరాళం
జయపురం: రాష్ట్రంలో ఇటీవల సంభవించిన దానా తుఫాన్‌తో సర్వస్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. బుధవారం జయపురం పట్టణానికి చెందిన వ్యాపారి అమరకుమార్ సాహు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ.లక్ష విరాళం ప్రకటించారు. ఈ మేరకు జయపురం సబ్ కలెక్టర్ ఎ.శొశ్య రెడ్డికి చెక్ అందజేశారు.
చోరీ సొత్తు స్వాధీనం
రాయగడ: రెండు దోపిడీ కేసులకు సంబంధించి నిందితులను అరెస్టు చేసి వారి నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును బాధిత కుటుంబాలకు బుధవారం అప్పగించారు. ఈ నెల 21న టికిరిలొని బంకాంబ పంచాయతీ ఉపొరొకొడింగ గ్రామానికి చెందిన రామ సాహు అనే వ్యక్తి ఇంటి పైకప్పు విరగ్గొట్టి లోపలికి చొరబడిన నిందితులు రూ.20 వేలు నగదు, బంగారు ఆభరణాలు దోచుకుపోయారు. ఈ మేరకు కేసు నమో దు చేసిన పోలీసులు నిందితులు పట్టుకుని దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌డీపీఓ రస్మీరంజన్ సేనాపతి, టికిరి ఐఐసీ విశ్వచందన్ బాగ్ సమక్షంలో బాధిత కుటుంబీకులైన రామసాము, నిరు పమ సాహులకు నగదు అప్పగించారు.
ప్రభుత్వ స్థలంలో
ఆక్రమణ తొలగింపు
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి చంచారగుడ పెట్రోల్ బంక్ సమీపంలో ప్రభుత్వ స్థలంలో ఉన్న దాబాను అధికారులు తొలగించారు. గతంలో ఈ స్థలాన్ని ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేసినా నిర్వాహకులు పట్టించుకోలేదు. దీంతో బుధవారం అధికారులు పోలీస్ బందోబస్తు నడయ బుల్డోజర్‌తో దాబాను తొలగించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
తేనెటీగల దాడిలో
40 మందికి గాయాలు
జయపురం: సబ్ డివిజన్ పరిధి బొయిపరిగుడ శ్మశానవాటికకు వచ్చిన వారిపై తేనెటీగలు దాడి చేయడంతో 40 మందికిపైగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బుధవారం ఉదయం బొయిపరిగుడ సమితి వార్డు మెంబర్ లక్ష్మీ మఝి తండ్రి మరణించడంతో ఆయనకు అంత్యక్రియలు జరిపేందుకు శ్మశానానికి తీసుకెళ్లారు. వారి వెంట సుమారు రెండు వందలకుపైగా బంధువులు, మిత్రులు ఉన్నారు. మృతదేహాన్ని దహన సంస్కారాలు చేస్తున్న సమయంలో పొగ ఆ ప్రాంతం అంతా వ్యాపించింది. దీంతో సమీపంలో ఉన్న ఒక చెట్టుకు ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా బయటకు వచ్చి శ్మశానంలో ఉన్నవారిపై దాడి జరిపాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వానిరిని బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రిలో చేర్చారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment