రాష్ట్ర ఎన్నికల కమిషనరు పదవి భర్తీకి నోచుకోవడం లేదు. ఈ హోదాలో బాధ్యతలు నిర్వహించిన ఆదిత్య ప్రసాద్ పాఢి పదవీ కాలం ఆగస్టు నెలతో పూర్తయ్యింది. ఇంత వరకు ఆయన స్థానంలో ఎన్నికల కమిషనరు నియామకం జరగలేదు. తాత్కాలిక సర్దుబాటు కోసం ఆయన మరికొంత కాలం ఈ హోదాలో కొనసాగేందుకు ఉత్తర్వులు జారీ చేసి పబ్బం గడుపుతున్నారు. ఒడిశా విద్యుత్ నియంత్రణ కమిషను (ఓఈఆర్‌సి) పరిస్థితి ఇలాగే ఉంది. ఈ సంస్థ కమిషనరుగా బాధ్యతలు నిర్వహించిన సురేష్ చంద్ర మహాపాత్రో మాజీ ముఖ్యమంత్రి సలహాదారునిగా నియామకం కావడంతో ఓఈఆర్‌సీ సారథ్యం కుంటుబడింది. రాష్ట్ర మహిళా కమిషను అధ్యక్ష పదవితో ఇతర సభ్యుల్ని తొలగించి ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త కమిషను సభ్యుల నియామకంపై మౌనం వహించింది. ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషను జీవచ్ఛవంలా ఉనికిని కాపాడుకోవడంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యని సవాలు చేసి మాజీ సభ్యులు రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు.
రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌లో ప్రముఖ సమాచార కమిషనరు (సీఐసీ) పదవితో మరో 5 మంది సభ్యుల పదవులు భర్తీ కావడం లేదు. మహిళా కమిషను తరహాలో ఈ సంస్థ ప్రాధాన్యత మరుగున పడింది. పాక్షిక న్యాయ వ్యవస్థలో ప్రముఖ సారథ్యం వహించాల్సిన అధ్యక్షుడు, కమిషనరు, సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నా.. గుమాస్తాలు తదితర అనుబంధ సిబ్బంది యథాతథంగా కొనసాగుతుండడంతో ప్రభుత్వ లెక్కల ప్రకారం సకాలంలో ప్రతి నెల క్రమం తప్పకుండా జీతభత్యాలు చెల్లించడం నిరవధికంగా కొనసాగుతుంది. వృధా వ్యయ భారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment