భగవాన్‌దాస్ మస్టారుకు ఘనంగా నివాళులు
విజయనగరం: క్రీడారంగంలో కబడ్డీ, ఖోఖో క్రీడల పితామహుడిగా ఖ్యాతినార్జించిన స్వర్గీయ వై.భగవాన్‌దాస్ మాస్టారు సేవలు ఎనిలేనివని జిల్లా యోగా అసోయేషన్ అధ్యక్షుడు, జనసేన నాయకుడు అవనాపు విక్రమ్ పేర్కొన్నారు. భగవాన్‌దాస్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం భగవాన్‌దాస్ మాస్టారు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన అవనాపు విక్రమ్‌తో పాటు ఆయన శిష్యబృందం కస్పా ఉన్నత పాఠశాల ప్రాంగణంలో భగవాన్‌దాస్ మాస్టారు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా స్థాయిలో ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలురకు నిర్వహించిన కబడ్డీ పోటీలను టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అవనాపు విక్రమ్ మాట్లాడుతూ దాస్ మాస్టారుతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ చైర్మన్‌గా తన తండ్రి స్వర్గీయ అవనాపు సూరిబాబు అందించిన సేవలు గుర్తు చేసుకున్నారు. వారిద్దరి సారథ్యంలో కబడ్డీ క్రీడలో విజయనగరం జిల్లాకు జాతీయ స్ధాయిలో గుర్తింపు లభించిందన్నారు. మళ్లీ కబడ్డీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తనవంతు సహాయ సహాకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా అవనాపు విక్రమ్ వెల్లడించారు. కార్యక్రమంలో భగవాన్ దాస్‌తో పాటు కబడ్డీకి సేవలు అందించిన వ్యాయామ ఉపాద్యాయులు శ్రీనివాసరావు, చిన్నంనాయుడు, చిట్టిరాజు, టీఎల్‌పీ రాజు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కేవీ ప్రభావతి, విశ్రాంత వ్యాయామ అధ్యాపకుడు బొమ్మన రామారావు, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు, వ్యాయామ ఉపధ్యాయులు, కబడ్డీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
జిలాస్థాయి కబడ్డీ పోటీలకు 27 జట్లు హాజరు
స్వర్గీయ వై.భగవాన్‌దాస్ మాస్టారు జయంతిని పురస్కరించుకుని భగవాన్‌దాస్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల బాలుర కబడ్డీ పోటీలకు అనూహ్య స్పందన లభించింది. కస్పా ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 27 జట్లు హాజరయ్యాయి. జోరువానలో సైతం ఆద్యంతం ఉత్కంఠభరితంగా పోటీలు సాగాయి. పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతి ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment