మాటలు ఘనం.. అభివృద్ధి శూన్యం..!
● మూలుగుతున్న మునిషిపొదొరొ
● మౌలిక సౌకర్యాలు కరువు ● పట్టించుకోని అధికారులు
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి మునిషిపొదొరొ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. కనీస మౌలిక సౌకర్యాలు లేక గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. 2024 మే నెలలో అతిసారంతో ఈ గ్రామానికి చెందిన ఐదుగురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య బృందాలు ఈ గ్రామంలో పర్యటించి వ్యాధికి గల కారణాలను నిర్ధారించారు. అనంతరం స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామంలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
అటకెక్కిన హామీలు
అయితే ఇచ్చిన హామీలు అక్కడికే పరిమితమయ్యాయి. ఘటన జరిగి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఈ గ్రామంలో అభివృద్ధి ఛాయలు కనిపించడం లేదు. సుమారు 35 కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామంలో రహదారి కూడా లేకపోవడం విచారకరం. ఇదిలాఉండగా తాగునీరు, విద్యుత్, ఆరోగ్యం, విద్య వంటి మౌలిక సౌకర్యాలకు గ్రామస్తులు దూరంగా ఉంటున్నారు. గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల నిర్మాణం కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అయితే గత మూడు నెలలుగా వీటి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇప్పటికీ పాఠశాల పనులు పూర్తి కాలేదు. పాఠశాల భవనం లేకపోవడంతో విద్యార్థులకు ఆరోగ్య కేంద్ర భవనం, గ్రామంలో ఎవరైనా ఇంటి ఆవరణలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన దుస్థితి నెలకొంది. ఈ పాఠశాలలో విద్యార్థులకు చదువు చెప్పేందుకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్పప్పటికీ, వారు సరిగ్గా పాఠశాలకు రావడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఒక్కటే కుళాయి
ఇదిలాఉండగా ఈ గ్రామంలోని రెండు వీధులకు కేవలం ఒకటే తాగునీటి కుళాయి ఉంది. అది కూడా అపరిశుభ్ర వాతావరణంలో ఉండడంతో గత్యంతరం లేని గ్రామస్తులు అదే నీటిని తాగేందుకు వినియోగిస్తున్నారు. డిప్తీరియా వ్యాధితో ఈ గ్రామంలో ఐదుగురు పిల్లలు మృతి చెందిన ఘటనలో దర్యాప్తు చేసిన వైద్య బృందాలు, అపరిశుభ్ర తాగునీటిని తాగడమే వ్యాధికి కారణమని నివేదిక ఇచ్చాయి. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించి తాగునీటి సౌకర్యాన్ని మెరుగు పరచాలన్న సంగతి మరిచిపోవడం విచారకరం. మనోరేగ పనుల ద్వారా గ్రామస్తులకు ఉపాధి అవకాశాలు కల్పించి, వారికి ఆర్థిక సహకారం అందించాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన పనులు శిలాఫలకానికే పరిమితమయ్యాయి. అందువలన ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గ్రామంలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment