సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి
పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని కేఆర్‌ఆర్‌సీ ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహించి అర్జీదారుల నుంచి 68 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, తద్వారా అర్జీదారు సంతృప్తి వ్యక్తం చేసేలా పరిష్కారం ఉండాలని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితులోను ఒకసారి వచ్చిన అర్జీ మళ్లీ రీ ఓపెన్ కారాదని అధికారులకు స్పష్టం చేశారు. పీజీఆర్‌ఎస్ పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో నోడల్ అధికారిని నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్‌పాల్, జిల్లా పశుసంవర్థకశాఖాధికారి డాక్టర్ ఎస్.మన్మథరావు, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ లక్ష్మణరావు, డ్వామా పీడీ రామచంద్రరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్‌కు 25 వినతులు
సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 25 వినతులు వచ్చాయి. పీహెచ్‌వో ఎస్‌వీ గణేష్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. హుస్సేన్‌పురం సచివాలయం నుంచి గదబవలసకు బీటీ రోడ్డు మంజూరు చేయాలని పెద్దగదబవలసకు చెందిన ఆర్.కృష్ణ వినతి అందజేశారు. మూలగూడకు చెందిన మండల పరిషత్ స్కూల్‌కు ప్రహరీ, మరుగుదొడ్లు మంజూరు చేయాలని పి.చౌదరి కోరారు. వజ్జాయిగూడ గ్రామస్తులు కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ట్రైకార్ రుణాలు ఇప్పించాలని పలువురు కోరారు. గిరిజన సంక్షేమశాఖ డీడీ అన్నదొర, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ రమాదేవి, వెలుగు ఏపీడీ సన్యాసిరావు, ఏటీడబ్ల్యూవో మంగవేణి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సాలూరులో 139 అర్జీలు
సాలూరు: మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 139 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర సీ్త్రశిశుసంక్షేమం, గిరిజన సంక్షేమశాఖమంత్రి గుమ్మడి సంధ్యారాణి, అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అవకాశమున్న సమస్యలను తక్షణమే, మిగిలిన సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ హేమలత, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, డీఎల్‌డీఓ రమేష్‌రామన్, ఐటీడీఏ డీఈ బలివాడ సంతోష్, జీఎస్‌డబ్ల్యూఎస్ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ చిట్టిబాబు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 5 ఫిర్యాదులు
పార్వతీపురంటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందే ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దని అదనపు ఎస్పీ డా.ఒ.దిలీప్ కిరణ్ అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయన నిర్వహించి 5 ఫిర్యాదులు స్వీకరిచారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని, వారి ఫిర్యాదులను పరిశీలించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రుల వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్ మోసం, ప్రేమ పేరుతో మోసం, ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించుకోగా, వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో అదనపు ఎస్పీ స్వయంగా ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవాలైనట్లయితే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీతో పాటు ఎస్సై ఫకృద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment