ఆటో బోల్తా పడి 20 మందికి గాయాలు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంద్ర సమితి ఝొలాగుడ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ప్రమాదంలో ఆటోలో ఉన్న 20 మంది గాయపడగా వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను కుంద్ర కమ్యూనిటీ ఆస్పత్రిలో చేర్పి్‌ంచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంద్రా సమితి సహిద్ లక్ష్మణ నాయిక్ మూల ఆదివాసీ సంఘం కుంద్రలో నిర్వహించిన పుష్‌పుణి ఉత్సవాలు తిలకించేందుకు గుండాల్ పంచాయతీ ఝొలాగుడ గ్రామం నుంచి ఆటోలో సుమారు 25 మంది వచ్చారు. ఉత్సవం తిలకించిన తరువాత వారంతా తిరిగి వెళ్తుండగా.. ఝొలాగుడ–కుంభారగుడ మధ్యలో ఆటో అదుపు తప్పి బోల్తాపడడంతో 20 మంది గాయపడగా వారందరినీ కుంద్ర కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం డాలి కమార్, రీణ కమార్, భగత్‌రామ్ హరిజన్, తులసీ కందాలియ, హేమలత రామపురియ, ఘాశీరాం ఖొర, సుశీల పెంటియ, విమలజానీలను కొరాపుట్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి రిఫర్ చేశారు. మిగతా 12 మందికి ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్లు కుంద్ర ఆస్పత్రి వైద్యులు డాక్టర్ గణేష్ ప్రసాద్ దాస్ వెల్లడించారు.
ఎనిమిది మంది పరిస్థితి విషమం
Comments
Please login to add a commentAdd a comment