ట్యాంకర్ బోల్తా
● ఇద్దరికి గాయాలు
రాయగడ: హైడ్రోక్లోరిన్ యాసిడ్ లోడ్‌తో విశాఖపట్నం నుంచి రాయగడకు వస్తుండగా బిసంకటక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిబులుగుడ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్, హెల్పర్‌్కు తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం రాత్రి చవటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. హైడ్రోక్లొరిన్ యాసీడ్‌తో వస్తున్న ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో ట్యాంకర్‌లోని యాసీడ్ కిందపడి మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ప్రమాదంలో చిక్కుకున్న డ్రైవర్, హెల్పర్‌లను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
మల్కన్‌గిరి: టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి కవుడిగూడ గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. కవుడిగూడ గ్రామం సమీపంలో ఇసుక లోడ్ చేసి ఘాట్ వద్దకు వస్తున్న టిప్పర్ అటుగా నడుచుకుంటూ వస్తున్న సుందర్ దురా (36)ను బలంగా ఢీకొని తలపై నుంచి వెళ్లిపోయింది. దీంతో సుందర్ దురా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ టిప్పర్‌ను అక్కడే వదిలేసి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న మత్తిలి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి.. సుందర్ దురా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
చెరువులో మునిగి చిన్నారి మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి కోయిలిపల్లి గ్రామంలో సోమవారం నాలుగేళ్ల చిన్నారి చెరువులో మునిగి మృతి చెందింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కోయిలిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న లక్ష్మీనాథ్ పంగి అనే వ్యక్తి కుమార్తె ధమునీ పంగి(4) ఇంట బయట ఆడుతూ చెరువు వద్దకు వెళ్లి లోపలకు పడిపోయింది. తల్లి ఎంత వెతికినా కనిపించలేదు. అటుగా వస్తున్న వారికి చెరువులో పాప తేలుతూ కనిపించడంతో దిగి బయటకు తీసి కోరుకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
సారా విక్రయాలపై ఆగ్రహం
జయపురం: జయపురం సమితి డిమ్ల గ్రామంలో విచ్చల విడిగా నాటు సారా అమ్ముతున్నారని ఆ గ్రామ ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గ్రామంలో అక్రమ నాటు సారా దుకాణాలను బంద్ చేయాలని సోమవారం డిమ్ల గ్రామం మహిళలు, స్వయం సహాయక గ్రూపు మహిళలు జయపురం సదర్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. సారా దుకాణాల వల్ల గ్రామంలో అశాంతి నెలకొందని, ఈ విషయంపై పలుమార్లు అధికారులకు విన్నవించినా మద్యం దుకాణాలలో మద్యం అమ్ముతున్నారని ఇప్పటికై నా తక్షణ చర్యలు చేపట్టి మద్యం దుకాణాలను బంద్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్టాన్ని అతిక్రమించి మద్యం దుకాణాలను తామే మూయిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment