విఫలయత్నం
సీఎం ఇంటి
ముట్టడికి
భువనేశ్వర్:
ఒడిశా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధికారిక నివాసం ముట్టడికి విఫలయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో వీరి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. యువజన కాంగ్రెస్ నాయకుడు రణజిత్ పాత్రో నేతృత్వంలో నిర్వహించిన యువ అసంతృప్తి సమావేశం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో భాగంగా ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి పాల్పడ్డారు. స్థానిక మాస్టర్ క్యాంటీన్ కూడలి ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. యువ అసంతృప్తి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయభాను చిబ్ ప్రసంగించారు. 11 ఏళ్ల మోదీ ప్రభుత్వం రాజ్యాంగంలోని అధికారాలను కుదించారని, దేశ యువతను మోసం చేసిందన్నారు. నిరుద్యోగం, మాదకద్రవ్యాల వ్యసనం మోదీ ప్రభుత్వ రెండు ప్రధాన ప్రణాళికలని ఆయన ఎద్దేవా చేశారు. ఈ విపత్కర పరిస్థితులకు వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతుందన్నారు. ఈ ఉద్యమం మారు మూల పంచాయతీల్లోకి తీసుకెళ్లాలని ఉదయభాను చిబ్ పిలుపునిచ్చారు. మోదీ, అదానీల లోపాయికారీ వ్యవహారాల్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటు లోపల, వెలుపల పదేపదే ఎండగడుతూ ప్రజలకు లోగుట్టు బహిర్గతం చేస్తున్నారని తెలిపారు. మోదీ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారిని ఈడీ, సీబీఐ, ఇతర కేంద్ర సంస్థలు వేధిస్తున్నాయి. దేశంలో ఇప్పుడు నిరుద్యోగ సమస్య తీవ్రమైంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ హామీ 11 ఏళ్ల తర్వాత కూడ వాస్తవ కార్యాచరణకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశాలో మోహన్ చరణ్ మాఝి ప్రభుత్వం కేంద్రం చెప్పు చేతల్లో కీలుబొమ్మ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి గిరిజనుడే అయినప్పటికీ ఇక్కడ గిరిజనులు అణచివేతకు గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులు, దళితులు మోహన్ ప్రభుత్వంలో భయం భయంగా బతుకుతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, అధిక ధరల భారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్ర ప్రజలకు 300 యూనిట్ల ఉచిత కరెంటు బదులుగా స్మార్ట్ మీటర్ల పేరిట నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. సమావేశంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్, జయదేవ్ జెనా, ప్రసాద్ హరిచందన్, తారా ప్రసాద్ బాహినీపతి, అఖిల భారత యవజన కాంగ్రెస్ కార్యదర్శి అజిత్ సింగ్, అభినవ్ భగత్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసులకు యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ
రాజధానిలో ఉద్రిక్త వాతావరణం
Comments
Please login to add a commentAdd a comment