చీపురుపల్లిలో చోరీ కలకలం
చీపురుపల్లి: చాలాకాలం తరువాత చీపురుపల్లి పట్టణంలో జరిగిన చోరీలు కలకలం సృష్టించాయి. అందులోనూ ఒకే రోజు మూడిళ్లలో చోరీ జరగడం స్థానికంగా భయాందోళనకు దారితీసింది. పథకం ప్రకారమే దుండగులు మూడిళ్లలో ప్రవేశించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చోరీ జరిగిన మూడిళ్లలోనూ ఎవరూ లేకపోవడం, తాళాలు వేసి ఉండడంతోనే ఆ ఇళ్లనే దుండగులు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మూడిళ్లలో చోరీలకు పాల్పడినప్పటికీ రెండిళ్లలో ఎలాంటి విలువైన వస్తువులు లభించకపోగా ఒక ఇంటిలో కేజీ 350 గ్రాములు వెండి, 700 గ్రాముల బంగారం చోరీకి గురయ్యాయి. ఆదివారం రాత్రి జరిగిన ఈ చోరీలకు సంబంధించి సోమవారం ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్సై ఎల్.దామోదరరావు దర్యాప్తు నిర్వహించి తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని లెక్చరర్స్ కాలనీలో నివాసం ఉంటున్న విశ్రాంత ఉపాధ్యాయుడు పెద్ది మహేశ్వరరావు, రామకృష్ణారెడ్డి కుటుంబాలు క్యాంప్‌లో ఉండడంతో వారి ఇళ్ల తాళాలు పగలుగొట్టి దుండగులు లోనికి ప్రవేశించారు. అలాగే కోటదుర్గమ్మవారి వీధిలో అరబిందో అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న బొత్స శ్రీహరిరావు నివాసంలో కూడా ఎవరూ లేకపోవడంతో ఇంటిలోకి దుండగులు ప్రవేశించారు. అయితే రామకృష్ణారెడ్డి, శ్రీహరిరావు ఇళ్లల్లో విలువైన వస్తువులు లేకపోవడంతో ఇళ్లను చిందరవందర చేశారు. లెక్చరర్స్ కాలనీకి చెందిన పెద్ది మహేశ్వరరావు నివాసంలో కేజీ 350 గ్రాములు వెండి, 7 గ్రాములు బంగారం అపహరించుకుపోయారు. క్లూస్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని నేరస్థుల ఆధారాలు సేకరించాయి. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై దామోదరరావు తెలిపారు.
ఒకే రోజు మూడిళ్లలో చోరీ
కేజీ 350 గ్రాములు వెండి, 7 గ్రాముల బంగారం అపహరణ
ఆధారాలు సేకరించిన క్లూస్ టీమ్
Comments
Please login to add a commentAdd a comment