రైల్ రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం
రాయగడ: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్ రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే అక్కడ ఉన్న సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరించి మంటలను ఆర్పగలిగారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వృద్ధులకు పండ్లు పంపిణీ
రాయగడ: స్థానిక ప్రెస్ యూనియన్ తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సభ్యులు మంగళవారం సేవా కార్యక్రమాలు చేశారు. ఇందులో భాగంగా స్థానిక హౌసింగ్ బోర్డు వద్ద గల వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. యూనియన్ అధ్యక్షులు అమూల్యరత్న సాహు, కార్యదర్శి శివాజీ దాస్, ముఖ్యసలహాదారుడు సురేష్ దాస్, సభ్యులు పాల్గొన్నారు. త్వరలోయూనియన్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యూనియన్ కార్యదర్శి శివాజీదాస్ తెలిపారు.
ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా
రాయగడ: రాయగడ–కలహండి జిల్లా సరిహద్దు తువాముల్ రాంపూర్ సమీపంలో గల నగరుండి పంచాయతీ మెలెగెరగ గ్రామం ఘాట్ రోడ్డు వద్ద ఆటో బోల్తా పడింది. సుమారు పది మీటర్ల లోయలో ఆటో పడిపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది గాయపడ్డారు. తువామూల్ రాంపూర్ పంచాయతీలొని మెలొగెర, సుమెండి, మండిపొదొరొ గ్రామాలకు చెందిన 8 మంది ఆటోలో కళ్యాణసింగుపూర్‌కు మంగళవారం బయల్దేరారు. మెలెగెరగా ఘాట్ రోడ్డు వద్ద ఆటో అదుపు తప్పి పడిపోయింది. దీంతో అటుగా వెళ్తున్న వారు స్పందించి వాహనంలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో కళ్యాణసింగుపూర్ ఆస్పత్రికి తరలించారు.
యువకుడు కిడ్నాప్
● రక్షించిన పోలీసులు
జయపురం: డబ్బుల కోసం ఒక యువకుడిని కొంతమంది కిడ్నాప్ చేశారు. అయితే పోలీసులు పకడ్బందీగా వ్యవహరించి కిడ్నాప్‌నకు గురైన యువకుడిని రక్షించారు. కిడ్నాప్ అయిన వ్యక్తి జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి ఖెందుగుడ డొంబు భూమియగా గుర్తించామని బొరిగుమ్మ సబ్‌డివిజన్ పోలీసు అధికారి తపశ్వణీ కువార్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన సాయంత్రం డొంబు భూమియ తన గ్రామ సమీపంలో ఉన్న సమయంలో దుండగులు కారులో వచ్చి అతడిని ఎత్తుకు పోయారు. ఈ విషయం తెలిసిన డొంబు సోదరుడు రామనాథ్ భూమియ బొరిగుమ్మ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారన్నారు. ఈ కేసులో దర్యాప్తు జరిపేందుకు ఒక పోలీసు టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆ టీమ్ కిడ్నాపైన యువకుడిని పలు ప్రాంతాలలో గాలించారు. మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కిడ్నాపర్లు ఎక్కడ ఉన్నారో గుర్తించామన్నారు. బొయిపరిగుడ సమితి రామగిరి సమీపంలో వారిని కనిపెట్టి దాడి చేయగా పోలీసులను చూచిన దుండగులు కారు విడిచి పారి పోయారని వెల్లడించారు. కారులో బంధిగా ఉన్న డొంబులు భూమియను రక్షించినట్లు వెల్లడించారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్‌డీపీవో తపశ్వణీ కువార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment