సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నిరసన
కొరాపుట్: భారత రాష్ట్రపతి ప్రసంగంపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఈ మేరకు నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డులో గాంధీ జంక్షన్ వద్ద ఆ పార్టీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. వెనుకబడిన వర్గాలకు చెందిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ అనుచిత వ్యాఖ్యలు చేస్తోందన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదన్నారు. గిరిజన తెగకి చెందిన ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలను తాను ఒక గిరిజనుడిగా ఖండిస్తున్నానని గౌరీ శంకర్ మజ్జి ప్రకటించారు.
జయపురం: పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ ప్రారంభంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ చేసిన వాఖ్యలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రసంగంపై అక్కసుతో బోరు కొట్టిందని, రాజకీయంగా ఉందని సోనియగాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఉద్దేశంతో కూడినవిగా పేర్కొన్నారు. ఈ మేరకు సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఆమె తన పదవికి రాజీనామా చేయాలన్నారు. అనంతరం జయపురం పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఎస్.మనోజ్ నేతృత్వంలో సోనియా గాంధీ చిత్రపటానికి దగ్ధం చేశారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చ పట్టణ అధ్యక్షురాలు భవానీ రెడ్డి, జయపురం బీజేపీ మండల్ ఉపాధ్యక్షుడు రఘునాథ్ పాణిగ్రహి, రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యురాలు సురభి పాణి, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ శాశ్వత సభ్యుడు గౌతమ సామంతరాయ్, సన చౌదరి తదితరులు పాల్గొన్నారు.
రాయగడ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు క్షమాపణ చెప్పాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా స్థానిక కాపిలాస్ కూడలి వద్ద శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారి దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. కార్యక్రమంలో బీజేడీ జిల్లా అధ్యక్షుడు శివ కుమార్ పట్నాయక్, కొరాపుట్ ఎమ్మెల్యే రాఘురామ్ మచ్చ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment