డివైడర్ పైకి దూసుకెళ్లిన కారు
భువనేశ్వర్: స్థానిక డొమొణ ప్రాంతంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రాంతంలో కారు అదుపు తప్పి డివైడర్‌పై నుంచి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణహాని వంటి పరిస్థితులు తలెత్తలేదు. చంద్రశేఖర్‌పూర్ ఠాణా పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి అనుబంధ చర్యలు చేపట్టారు.
యువకుడి ఆత్మహత్య
రాయగడ: స్థానిక దోబీ వీధిలో నివసిస్తున్న ఒక యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి మృతుడు దేవర శెట్టి గణేష్ (23)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐఐసీ కేకేబీకే కుహరో తెలియజేసిన వివరాల మేరకు.. గణేష్ అనే వ్యక్తి గత కొన్నాళ్లుగా దోబీ వీధిలో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. వంటలు చేసుకుని జీవనోపాధి పొందుతున్న గణేష్ శనివారం మధ్యాహ్నం ఇంటి పైకప్పుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే వివరాలు తెలియాల్సి ఉంది.
అనుమానాస్పదంగా బాలుడి మృతి
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి కేంద్రంలో డైలీ మార్కెట్ వద్ద నివాసముంటున్న సూర్యనారాయణ సాహు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తన 10 ఏళ్ల కుమారుడు కృష్ణసాహు ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. సూర్యనారాయణ సాహు బయటకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి కుమారుడు ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే బాలుడిని కలిమెల ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఏం జరిగిందని వైద్యులు ప్రశ్నించడంతో పిల్లాడు ఉరి వేసుకున్నాడని తెలిపారు. దీంతో కలిమెల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐఐసీ చంద్రకాంత్ తండి ఆరోగ్య కేంద్రానికి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పరిశీలించగా మేడ భాగంపై తాళం గుర్తు ఉండడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు కలిమెలలో సరస్వతీ శిశు మందిర్‌లో 4వ తరగతి చదువుతున్నాడు.
దోపిడీకి ప్రయత్నించిన
నిందితుడి అరెస్టు
జయపురం: సమితిలోని 26వ జాతీయ రహదారి రొండాపల్లి పెట్రోల్ బంక్ వద్ద ఒక ట్రక్కు డ్రైవర్‌ను దోచుకోవడానికి ప్రయత్నించిన నిందితుల్లో ఒక వ్యక్తిని అరెసు్‌ట్ చేసినట్లు జయపురం సదర్ పోలీసు అధికారి ఈశ్వర తండి శనివారం వెల్లడించారు. గత నెల 30వ తేదీన డెంకనాల్ జిల్లా కామాక్షినగర్‌కు చెందిన హరేకృష్ణ సాహు కుమారుడు పద్మనాభ సాహు చేసిన ఫిర్యాదు మేరకు.. జాతీయ రహదారిపై రొండాపల్లి గ్రామ సమీపంలో పెట్రోలు పంపు వద్ద భోజనం చేసి విశ్రాంతి తీసుకొనేందుకు తన ట్రక్కును నిలిపినట్లు పేర్కొన్నాడు. అదే సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా వచ్చి అతడిపై దాడి జరిపారు. అనంతరం ఫోన్ లాక్కొనేందుకు ప్రయత్నించారని దీంతో పెట్రోలు పంపు వద్దనున్న వారు వచ్చి కాపాడినట్లు పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా జయపురం సమితి నందగుడ గ్రామానికి చెందిన రాజకుమార్ కకిడి మరో వ్యక్తితో కలిసి దోపిడీకి ప్రయత్నించినట్లు వెల్లడైందన్నారు. నిందితుడిని అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment