ఆలపాటికి ఆమోదం ఏదీ! | - | Sakshi
Sakshi News home page

ఆలపాటికి ఆమోదం ఏదీ!

Published Fri, Oct 18 2024 3:02 AM | Last Updated on Fri, Oct 18 2024 3:02 AM

ఆలపాటికి ఆమోదం ఏదీ!

సాక్షి, విజయవాడ: ముందడుగు మనదైతే అధిష్ఠానం ముందరి కాళ్లకు బంధం వేయవచ్చన్న వ్యూహంతో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ వేస్తున్న అడుగులు ఆయన రాజకీయానికి చేటు తెచ్చేలా ఉన్నాయి. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు... అన్న చందాన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని తానేనంటూ చేసుకుంటున్న స్వీయ ప్రచారాన్ని కూటమి వర్గాలు తప్పుపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆలపాటి తీరును కూటమి పక్షాల సంగతి అటుంచి స్వపక్షంలోని సీనియర్లతో సహా ఆ పార్టీకి చెందిన విభిన్న సామాజికవర్గాల వారు అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారు. స్వయంప్రకటిత అభ్యర్థిత్వం చెల్లుబాటు కాదని, పార్టీ ముఖ్య నాయకులు, నిఘా వర్గాల సమాచారాన్ని సమీక్షించుకున్న తరువాతే అభ్యర్థి ఎవరనే స్పష్టత వస్తుందని టీడీపీ అధిష్ఠానం కూటమిలోని జనసేన, బీజేపీ ముఖ్యులకు సమాచారం పంపిందని వినికిడి. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన ఆలపాటికి గత ఎన్నికల్లో తెనాలి నుంచి టీడీపీ టిక్కెట్టు దక్కకపోవడంతో ఏదో ఒక ముఖ్య పదవి ఆశిస్తున్న నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవకాశంగా అనిపించింది. పార్టీ పనిలో భాగంగా పట్టభద్రుల ఓటర్ల చేరిక తదితరాలను చూడాలని అధిష్ఠానం సూచించిందని, తననే అభ్య ర్థిగా పోటీలో నిలుపుతారనే ప్రచారాన్ని ఆలపాటి చేసుకుంటున్నారని, అంతకుమించి అధిష్ఠానం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా, సూచనలు చేయలేదని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల సీనియర్లు గుర్తు చేస్తున్నారు. అధిష్ఠానం చెప్పకుండా ఆయన కోసం తాము నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఎలా నిర్వహిస్తామని ప్రస్తుత గుంటూరు జిల్లాలోని ఓ శాసనసభ్యుడు ప్రశ్నించడంతో ఆలపాటి వర్గీయులు వెనుతిరిగారనేది సమాచారం. ప్రస్తుత గుంటూరు జిల్లా నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పెమ్మసాని చంద్రశేఖర్‌, నారా లోకేష్‌, నాదెండ్ల మనోహర్‌లు ఉండగా మళ్లీ అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీకి ఎలా నిలుపుతారని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నాయకులు అభిప్రాయపడుతుండటం పరిశీలనాంశం. ‘ఎలాంటి హోదా, అధికారం లేకుండానే ఆయన పెత్తనం చెలాయిస్తున్నారు. అధికారుల పోస్టింగ్‌లు తనకు అనుకూలంగా ఉండాలని గట్టి పైరవీలు చేశారు. పోలీసులు, మునిసిపల్‌ అధికారులకు హుకుం జారీ చేస్తూ పనులు చేయాలని ఒత్తిళ్లు చేస్తున్నారు. అలాంటి ఆయనకు పదవి కూడా సమకూరితే నియోజకవర్గంలో మేమేం చేయాలి’ అని కూటమిలోని ముఖ్య నేత వద్ద ఓ ప్రజాప్రతినిధి ప్రస్తావించినట్లు తెలిసింది. ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం గురించి సంప్రదించారా, అలాంటివి ఏమీ లేకుండానే నిర్ణయం జరిగిపోయినట్లు ప్రచారం ఎలా చేసుకుంటారని కూడా అడిగారనేది సమాచారం.

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయాలని ఆశిస్తున్న వారి సంఖ్య కూటమి పార్టీల నుంచి ఎక్కువగానే ఉంది. ఎవరంతట వారు ప్రయత్నాలు అంతర్గతంగా చేసుకుంటున్నారని తెలిసింది. కాగా ఆలపాటి అన్ని మార్గాల్లోనూ ప్రచారం వేగవంతం చేస్తుండటాన్ని టీడీపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి కట్టడి చేయాలని, లేదా ఏదో ఒక స్పష్టత ఇవ్వాలని కూటమి నేతలు కోరనున్నట్లు తెలిసింది.

ఆలపాటికి సహకారం అనుమానమే..

ఆలపాటిని రాజకీయంగా బాహాటంగా వ్యతిరేకించే సీనియర్లు ఉమ్మడి గుంటూరులో పెద్దసంఖ్యలోనే ఉన్నారు. ఇరుగుపొరుగు నియోజకవర్గాలలో జోక్యం చేసుకుంటూ ఇబ్బందులు పెడుతుంటారనే ఆరోపణలు ఆలపాటిపై లేకపోలేదు. తెనాలి సీటు ఇవ్వలేని పక్షంలో తనకు మరోచోట అయినా ఇవ్వాలంటూ ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలోని నియోజకవర్గాలపై ఆయన దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఆయా నియోజకవర్గాలకు చెందిన వారు ఆలపాటికి రేపటి ఎన్నికల్లో సహకరిస్తారా అనే అనుమానాలు కూడా అధిష్ఠానంలో ఉన్నాయని గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు అభిప్రాయపడటం పరిశీలనాంశం. ‘మా బాబు గారి సంగతి తెలియంది ఏముంది. ముందుగా ప్రచారానికి ఒక రాయి విసురుతారు. తను ఇవ్వాలనుకుంటే ఇస్తారు. లేదంటే నీపై వ్యతిరేకత తీవ్రంగా ఉంది. నివేదికలు భిన్నంగా ఉన్నాయి కుదరదు అంటారు’ అని ముక్తాయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement