No Headline
సత్తెనపల్లి: నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రతి విద్యార్థికి జీవిత కాల గుర్తింపు సంఖ్యతో కార్డు జారీ చేయాలని మూడేళ్ల కిందటే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ మాదిరిగానే ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) పేరుతో 12 అంకెల సంఖ్యతో గుర్తింపు కార్డు జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థుల అకాడమిక్ పురోగతిని అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. జిల్లాలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వీటిని జారీ చేయాలని నిర్ణయించారు. తొలి విడతగా 9,10 తరగతుల విద్యార్థులకు వీటిని జారీ చేసే ప్రక్రియ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ తరగతుల విద్యార్థులు 58,990 మంది ఉన్నారు. అపార్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని మండల విద్యాశాఖ అధికారులు ఆయా బడుల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చారు.
విద్యార్థుల వివరాల్లో తేడాలు...
అపార్ కార్డుల జారీలో ఇబ్బందులు తప్పడం లేదు. జారీ బాధ్యతలను ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. లక్ష్యం మేరకు కార్డులు జారీ చేయకపోతే తాఖీదులు ఇస్తామని విద్యాశాఖ అధికారులు ఇప్పటికే హుకుం జారీ చేశారు. చాలా మంది విద్యార్థుల వివరాలు పాఠశాల దస్త్రాల్లో ఒకరకంగా ... ఆధార్ కార్డులో మరో రకంగా ఉన్నాయి. చాలా పాఠశాలల్లో 30 నుంచి 50 శాతం వివరాలే సరిపోలుతున్నాయి. ఆధార్ నమోదులోనే ఎక్కువగా తప్పులు ఉంటున్నాయి. ఒకసారి అపార్ కార్డు ఇస్తే విద్యార్థి చదువు పూర్తి అయ్యేవరకు ఇదే నెంబర్ ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల వివరాల నమోదులో పొరపాట్లకు తావు లేకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
తప్పులు సవరించుకుంటేనే...
7–8 ఏళ్ల కిందట ఆధార్ తీసుకున్న వారి వివరాల్లో పెద్ద ఎత్తున తప్పులు ఉన్నాయి. దీంతో వాటిని సరి చేసుకోవాల్సి ఉంది. ఇందు కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లాలి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఆధార్ సవరణ కేంద్రాలు లేవు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పక్క గ్రామాలకు తీసుకెళ్లి వివరాలు మార్చుకోవాల్సి వస్తోంది. వ్యవసాయ పనుల కారణంగా చాలామంది ఇందుకోసం సమయం వెచ్చించలేకపోతున్నారు.
నత్తనడకన నమోదు ప్రక్రియ
ఆధార్‌లో తేడాలే జాప్యానికి కారణం
సవరణలకు విద్యార్థుల అష్టకష్టాలు
Comments
Please login to add a commentAdd a comment