రైల్వేలో పార్శిల్ బుకింగ్ నిలిపివేత
నరసరావుపేట: పార్శిల్ బుకింగ్‌లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. రైళ్లు కేవలం వన్ మినిట్ ఆగే స్టేషన్లలో బుకింగ్ సౌకర్యాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రయాణికులు టిక్కెట్ తీసుకొని తమతో పార్శిల్ బుక్ చేస్తే తీసుకెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రైళ్లు ఐదు నిమిషాలకుపైగా ఆగే స్టేషన్లు అయిన గుంటూరు, నంద్యాలలో మాత్రమే ప్రస్తుతం పార్శిల్ బుకింగ్ సౌకర్యం ఉంది.
ముఖ్యంగా బెంగళూరు, గోవా, కాచిగూడ, మహబూబ్‌నగర్, జడ్చర్ల, ఆలంపూర్, శంషాబాద్, రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాలకు లగేజీ బుకింగ్ సౌలభ్యం ఉండేది. తాజా నిర్ణయం కారణంగా ప్రయాణికులు ఈ అవకాశం కోల్పోయారు. ఏదైనా లగేజ్‌ని పల్నాడు ప్రాంత వాసులు బుక్ చేయాల్సి వస్తే గుంటూరులోని కేంద్రానికి వెళ్లాల్సిందే. అదేవిధంగా బెంగళూరు, గోవా, కాచిగూడ, తిరుపతి. కర్నూలు. కడప, అనంతపురం, నంద్యాల, గిద్దలూరు లాంటి ప్రాంతాల నుంచి పల్నాడు ప్రాంతానికి చెందిన వారు ఏ విధమైన లగేజీలను బుక్ చేసుకున్నా.. నరసరావుపేట రైల్వే స్టేషన్‌లో డెలివరీ తీసుకునే అవకాశం కోల్పోతున్నారు. వీరంతా ఇక నుంచి గుంటూరు పార్శిల్ కేంద్రం నుంచే డెలివరీ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా ప్రతి రైలు ప్రారంభపు స్టేజీ నుంచి గమ్యస్థానం చేరే వరకు ప్రయాణించే సమయంలో కొంత లూజ్ టైం కూడా నిర్ణయించి నడుపుతారు. ఈ లూజ్ టైంలోనే ఆయా ప్రాంతాలలో బుకింగ్ చేసిన పార్శిళ్లను పార్శిల్ పాయింట్ కమర్షియల్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో దించడం, ఎక్కించడం చేస్తుంటారు. రైలు నడిపే క్రమంలోనే దాని షెడ్యూల్లో ఈ లూజ్ టైం కూడా కలిపి అధికారులు టైంటేబుల్ అమలు చేస్తుంటారు. బుకింగ్ రద్దు నిర్ణయంపై స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి పార్శిల్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.
ఒక నిమిషం హాల్టింగ్ స్టేషన్లలో అమలు
గుంటూరు నుంచే ఇక బుకింగ్
Comments
Please login to add a commentAdd a comment