మాతో అక్రమ విధులు చేయించవద్దు
నరసరావుపేట: గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)తో చేయిస్తున్న అక్రమ విధులను రద్దుచేసి ఎన్నాళ్లుగానో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ జిల్లా అధ్యక్షులు షేక్ బందగీ సాహెబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమ వారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సమస్యలు పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద వీఆర్‌ఏలు ధర్నా చేశారు. దీనికి జిల్లాలో ఉన్న అన్ని మండల వీఆర్‌ఏలు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి బందగీ సాహెబ్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటినా మా సమస్యలు పరిష్కారం చేయాలనే ఆలోచన లేకుండా వీఆర్‌ఏలపై అదనపు భారం మోపే ప్రయత్నం చేస్తుందన్నారు. వీఆర్‌ఏలను తహసీల్దార్ కార్యాలయాలకు నైట్ వాచ్‌మన్ డ్యూటీలు వేయడం, తహసీల్దార్ ఆర్డీవో కార్యాలయాలలో అటెండర్‌గా ఉపయోగించటం, ఇసుక డంపు వద్ద రాత్రి, పగలు డ్యూటీలు వేయడం, వీఆర్‌ఏల చేత బీఎల్‌వోలు డ్యూటీలు చేయించడం లాంటి అక్రమ డ్యూటీలు చేయిస్తున్నారన్నారు. ప్రభుత్వం వీఆర్‌ఏల పట్ల ఆలోచన చేసి వారికి పేస్కేలు అమలు చేయాలని, వీఆర్వోగా ప్రమోషన్లు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న నైట్ వాచ్‌మెన్, అటెండర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను వీఆర్‌ఏల చేత భర్తీ చేయించాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్‌ఏలగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మా సమస్యలు పరిష్కరించని పక్షంలో ఈనెల 18న మంగళగిరి సీసీఎల్‌ఏ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనందరాజు, సత్తెనపల్లి డివిజన్ అధ్యక్షులు సంజీవరావు, ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, గురజాల డివిజన్ నాయకులు దైవ సహాయం, శ్రీను, నరసరావుపేట డివిజన్ అధ్యక్షులు ఆనంద్, అన్ని మండల అధ్యక్షులు కార్యదర్శులు వీఆర్‌ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట వీఆర్‌ఏల ధర్నా
Comments
Please login to add a commentAdd a comment