మార్చి ఆఖరులోగా ఇళ్లు కట్టకపోతే బిల్లులు రావు
ప్రత్తిపాడు: ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించిన లబ్ధిదారులు మార్చి నెలాఖరులోగా పూర్తి చేయకుంటే వాటికి సంబంధించి బిల్లులు రావని గృహనిర్మాణ శాఖ పీడీ జె.వి.ఎస్.ఆర్.కె.వి. ప్రసాద్ తెలిపారు. నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడులో మంగళవారం పీడీ పర్యటించారు. స్థానిక హౌసింగ్ లే అవుట్‌లోని ఇళ్లను మండల అధికారులతో కలిసి పరిశీలించారు. ఎంతమందికి పట్టాలిచ్చారు, ఎన్ని ఇళ్లు పూర్తయ్యాయి, ఏ దశల్లో ఎన్ని ఉన్నాయి..? వంటి వివరాలను హౌసింగ్ ఏఈ, ఇంజినీరింగ్ అసిస్టెంట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్థిక పరిస్థితి సహకరించని వారికి వెలుగు ద్వారా అధిక రుణాలు మంజూరు చేయించాలని ఎంపీడీవో శివపార్వతి, వెలుగు అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు రోజుకో మండలంలో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు క్రయ, విక్రయాలు చెయ్యడానికి వీల్లేదని పీడీ స్పష్టం చేశారు. వెంట ఎంపీడీవో కె. శివపార్వతి, హౌసింగ్ ఈఈ ఎ. శంకరరావు, డీఈ సత్యనారాయణ, ఏఈ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment