కూటమి బెల్టు | - | Sakshi
Sakshi News home page

కూటమి బెల్టు

Published Wed, Nov 6 2024 2:24 AM | Last Updated on Wed, Nov 6 2024 2:24 AM

కూటమి

కూటమి బెల్టు

గ్రామ గ్రామాన
● ఏకంగా రెస్టారెంట్‌ తరహాలో నిర్మాణాలు చేసి మద్యం విక్రయిస్తున్న వైనం ● బాటిల్‌పై రూ.30 నుంచి రూ.50 అదనం ● ఇందులో గ్రామ టీడీపీ నేతకు ప్రతి బాటిల్‌ పై రూ.10 కప్పం
● దుకాణాల ఏర్పాటులో బరితెగించిన కూటమి నేతలు ● అనుమతి లేకపోయినా వీధికో దుకాణం

జిల్లాలో విచ్చలవిడిగా బెల్టుషాపులు

సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వంలో గ్రామాలలో మంచినీరు దొరకుతుందో లేదో కానీ మద్యం మాత్రం ఏరులైపారుతోంది. ప్రతి గ్రామంలో వీధికో బెల్టుషాపు ఏర్పాటుచేసి 24/7 మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని విచ్చలవిడిగా అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడుతున్నారు. బెల్టుషాపుల నిర్వహిస్తే కఠిన చర్యలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నీటిమీద రాతలుగానే మారాయి. ఇప్పటికే మందుబాబులు గ్రామాలలో గొడవలకు దిగుతుండగా.. బెల్టుషాపులతో నిత్యం మందు దొరకడంతో భార్యల పుస్తెలతాడులను సైతం కుదువ పెట్టి తాగే పరిస్థితి రానుందని మహిళలు ఆందోళన చెందుతున్నారు. పల్నాడు జిల్లాలో దాదాపుగా అన్ని గ్రామాలలో బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు.

అ‘ధన’ంగా విక్రయాలు..

గ్రామాలలో నిర్వహించే బెల్టుషాపులలో క్వాటర్‌ బాటిల్‌కు రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా విక్రయిస్తున్నారు. ఎంఆర్‌పీకి మద్యం దుకాణాలలో కొనుగోలు చేసి పల్లెల్లో అక్రమ విక్రయాలకు తెరదీస్తున్నారు. వచ్చిన ఆదాయంలో గ్రామ టీడీపీ నేతలకు క్వార్టర్‌కు రూ.10 కప్పం కడుతున్నారు. దీంతో ఎకై ్సజ్‌, పోలీసు అధికారులు ఎవరూ కన్నెత్తి చూడకుండా లోకల్‌ నాయకులు వ్యవహారాన్ని చక్కదిద్దుతున్నారు.

రెస్టారెంట్‌లను తలపించేలా...

పట్టణ శివారు కాలనీలలో బార్‌ అండ్‌ రెస్టారెంట్లను తలపించే విధంగా బెల్టుదుకాణాలు నిర్వహిస్తున్నారు. కొంత మంది అధికారపార్టీకి చెందిన నాయకులు తమ హోటళ్లు, డాబా రెస్టారెంట్లలో బహిరంగంగా మద్యం విక్రయిస్తున్నారు. అక్కడే కూర్చొని సేవించేందుకు అన్ని ఏర్పాట్లు కల్పిస్తున్నారు. మద్యం దుకాణాల నుంచి కొనుగోలు చేసి వచ్చి ఇక్కడ అదనపు ధరకు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు.

● నరసరావుపేట ఎస్‌ఆర్‌కేటీ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన డాబా, రావిపాడు రోడ్డు సమీపంలో ఉన్న హోటళ్లలలో అనధికారికంగా బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు చంద్రబాబునాయుడు కాలనీ, శివసంజీవయ్య, బీసీ కాలనీలలో గృహాలలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

● నరసరావుపేట రూరల్‌ పరిధిలోని చినతురకపాలెం గ్రామంలో టీడీపీ నాయకుడు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అందులో తాత్కాలిక శిబిరాన్ని నిర్మించి మద్యం విక్రయాలు చేస్తున్నాడు.

● జొన్నలగడ్డ మెయిన్‌రోడ్డుపైన జడ్పీ ప్రభుత్వ పాఠశాల ఎదుట బెల్టుషాపు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. పుణ్యక్షేత్రం కోటప్పకొండ పరిసరప్రాంతాలలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గురజాల రూరల్‌ ఏరియాలో మూడు మద్యం దుకాణాలకు గాను రాజకీయ కారణాలతో కేవలం ఒకటి మాత్రమే ప్రారంభించడంతో ఆయా గ్రామాలలో బెల్టుషాపు నిర్వాహకులు నిర్ణయించిన ధరే ఫైనల్‌ అవుతోంది.

విచ్చలవిడిగా

సరఫరా...

కూటమి ప్రభుత్వం ఇటీవల కేటాయించిన ప్రైవేట్‌ మద్యం దుకాణాల నుంచి బెల్టుషాపులకు విచ్చలవిడిగా మద్యం బాటిళ్ల సరఫరా అవుతున్నాయి. ఇందు కోసం వైన్‌షాపుల నిర్వాహకులు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసుకొని గ్రామాలలోని బెల్టుషాపులకు మద్యం బాటిళ్లను అందజేస్తున్నారు. ఇందుకోసం ఎంఆర్‌పీ కన్నా అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాలపై అధికారుల నియంత్రణ ఉండేది. అధికమొత్తంలో మద్యం బాటిళ్లు విక్రయించేవారు కాదు. ఒకవేళ అధిక మొత్తంలో మద్యం బాటిళ్లు కలిగి ఉన్నా కేసులు నమోదు చేసేవారు. ప్రస్తుతం టీడీపీ నాయకుల కనుసన్నల్లో మద్యం దుకాణాలు నిర్వహణ జరుగుతుండటంతో మద్యం విక్రయాలపై ఎకై ్సజ్‌ శాఖ పర్యవేక్షణ కొరవడింది.

మద్యం అమ్మకాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు

బెల్టుషాపులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు...

నూతన మద్యం పాలసీ ప్రకారం మద్యం బెల్టుషాపుల నిర్వహణకు అనుమతి లేదు. నిబంధనలను అతిక్రమించి మద్యం విక్రయించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఇప్పటికే గత వారం రోజులుగా 34 కేసులు నమోదుచేశాం. పదే పదే బెల్టుషాపులు నిర్వహిస్తూ పట్టుబడితే పీడీ యాక్టులు సైతం నమోదు చేయడానికి వెనుకాడం. – మణికంఠ, పల్నాడు జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
కూటమి బెల్టు1
1/2

కూటమి బెల్టు

కూటమి బెల్టు2
2/2

కూటమి బెల్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement