సీఎం పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన
తాళ్ళాయపాలెం (తాడికొండ): ఈ నెల 7వ తేదీన తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్,నాగలక్ష్మి, ట్రాన్స్‌కో జేఎండీ కీర్తి చేకూరి, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అఽధికారులతో చర్చించి పలు సూచనలు, సలహాలిచ్చారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ... తాళ్ళాయపాలెంలో 7వ తేదీన సీఎం చేతుల మీదుగా 400/200 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం కానుందని తెలిపారు. అనంతరం ఇతర జిల్లాలకు సంబంధించిన అభివృద్ధి పనులకు కూడా సీఎం వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు చేయనున్నారని చెప్పారు. ట్రాక్స్‌కో ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా, గుంటూరు ఆర్డీవో కె.శ్రీనివాసరావు, ఎంపీడీవో శిల్ప, తహసీల్దార్ సుజాత తదితరులు పాల్గొన్నారు. కాగా, సీఎం ప్రారంభించనున్న సబ్‌స్టేషన్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి కె.విజయానంద్ మంగళవారం పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.
పది పరీక్ష ఫీజు చెల్లింపునకు 18 వరకు అవకాశం
యడ్లపాడు: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు ప్రభుత్వం గడువుపెంచింది. ఈనెల 18వ తేదీ వరకు అవకాశం కల్పిస్తూ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. అపరాధ రుసుంతో వచ్చే నెల వరకు చెల్లించుకోవచ్చని పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ చంద్రకళ తెలిపారు. ఈనెల 19 నుంచి 25వ తేదీలోగా రూ.50 అపరాధ రుసుంతో ఫీజు చెల్లించవచ్చు. 26 నుంచి వచ్చేనెల మూడో తేదీలోగా రూ.200 అపరాధ రుసుంతో వచ్చే నెల నాలుగు నుంచి 10వ తేదీ వరకు రూ.500 అపరాధ రుసుంతో ఫీజు చెల్లించవచ్చు. చైల్డ్ విత్ స్పెషల్ నీడ్ (సీడబ్ల్యూఎస్‌ఎన్) విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించనవసరం లేదు. సదరం సర్టిఫికెట్ లేని వారు సంబంధిత పాఠశాల హెచ్‌ఎం ద్వారా ప్రభుత్వ పరీక్షల విభాగం పంపించిన ఫార్మేట్‌లో సివిల్ సర్జన్‌తో తీసుకున్న ధ్రువీకరణ పత్రం పొందుపరిచే వీలును ప్రభుత్వం కల్పించింది. ఆన్‌లైన్ దరఖాస్తులు www. bre.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. పూర్తిచేసిన దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
పురస్కారానికి పెనుగొండ లక్ష్మీనారాయణ ఎంపిక
నగరంపాలెం: అజో విభో కందాళం ఫౌండేషన్ ప్రతి సంవత్సరం రచయితకు విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. వచ్చే ఏడాది 2025కిగాను అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణను పురస్కారానికి ఎంపిక చేసినట్లు అరసం ఏపీ ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 3, 4, 5వ తేదీల్లో విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో జరగబోయే సభలో ఆయనకు ఈ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.
డిసెంబర్ 14న జాతీయ మెగా లోక్‌అదాలత్
సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు
రేపల్లెరూరల్: మెగా లోక్‌అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించి కక్షిదారులకు న్యాయం చేకూరేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక సబ్‌కోర్టు ప్రాంగణంలో డిసెంబర్ 14వ తేదీన జరగనున్న జాతీయ మెగా లోక్‌అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కారం అయ్యేలా పనిచేయాలని కోరుతూ సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులతో మంగళవారం స్థానిక కోర్టు హాలులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించి కక్షిదారులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో న్యాయశాఖ ప్రతినెల లోక్‌అదాలత్ నిర్వహిస్తోందన్నారు. కోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment