గుంటూరు వెస్ట్ : ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యుల ఎన్నికలకు అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో అధికారులు తదితరులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికలకు వచ్చే మార్చిలో షెడ్యూల్ విడుదల చేస్తారన్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 30వ తేదీ నుంచి ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2,83,100 మంది ఆన్‌లైన్ ద్వారా, ఆఫ్‌లైన్‌లో 48,900 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే 80 శాతం డిస్పోజ్ చేశామని, మిగిలినవి కూడా బుధవారం నాటికి పూర్తి చేస్తామన్నారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రింట్‌ను 23న వెల్లడిస్తామని చెప్పారు. 23 నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి డిసెంబరు 25 నాటికి పరిష్కరిస్తామన్నారు. అదే నెల చివరి నాటికి తుది జాబితా ప్రచురిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్వో ఖాజావలి, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment