ప్రచురణ రంగం..!
పుస్తకాలు వెయ్యి కాపీలు వేసే ప్రొఫెషనల్ పబ్లిషింగ్ ఇప్పుడు లేదు. యూనికోడ్ వచ్చాక ఎవరికివారు అందులో రాసుకుని తక్కువ కాపీలను డిజిటల్ ప్రింటింగ్ చేయిస్తున్నారు. పుస్తకాలను కొనకపోవటంతో వచ్చిన పరిస్థితిది. సామాజికశాస్త్రాలు, రాజకీయ నేపథ్యం ఉన్న పుస్తకాలను అధ్యయనం కోసం కొంటున్నారు. చదివినా చదవకున్నా, ఆధ్యాత్మిక పుస్తకాలు పోతున్నాయి. దళిత సాహిత్యం బాగానే అమ్ముడవుతోంది.
– వెంకటనారాయణ,
పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ
తెనాలి: పుస్తకం నిజంగా మనకు నేస్తం.. ఒకరకంగా అంతకుమించి అనొచ్చు. ‘పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం వంటిది’ అన్నాడో పెద్దమనిషి. మనం సృజనాత్మకంగా జీవించాలంటే పుస్తకాలు ఉండాలి. ఏదైనా ఒక పుస్తకం చదివితే అందులోని పాత్రలు స్ఫూర్తినిస్తాయి. భావోద్వేగాలను అర్థం చేసుకునే పరిణితి సిద్ధిస్తుంది. వివిధ సందర్భాల్లో అవసరమైన నిర్ణయాలను తీసుకోవడానికి పుస్తక పఠనం కచ్చితంగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. సమాజం, పరిసరాలపై అవగాహన కలుగుతుంది. ఇంతటి ప్రాధాన్యం గల పుస్తక పఠనం నేడు తగ్గిపోతోంది. ఫలితంగా ప్రచురణ రంగం కుదేలవుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. విజయవాడలో పుస్తక మహోత్సవం జరుగుతున్న సందర్భంగా పుస్తకావేదన తీర్చాల్సిన తురణం ఇది.
ఒకప్పుడు యమ క్రేజ్
ఒకప్పుడు చరిత్ర, సామాజిక పరిజ్ఞానం, కాల్పనిక సాహిత్య రచనలు పెద్దలు చదివేవారు. అపరాధ పరిశోధన నవలలు సరేసరి! హాట్‌కేకులే.. పెద్దలు చదువుతుంటే, పిల్లలు కూడా వాటిపై దృష్టి పెట్టేవారు. ఊరిలో ఉండే లైబ్రరీకి తరచూ వెళ్లటం, పుస్తకాలు ఇంటికి తెచ్చుకుని, చదవటం ఒక అలవాటు. పాఠశాల/కాలేజీల్లోనూ లైబ్రరీ అందుబాటులో ఉండేది. దిన, వార, మాసపత్రికలు సహా ప్రముఖ రచయితల రచనలన్నీ లైబ్రరీల్లో లభ్యమయేవి. కాల్పనిక నవలలు, కథాసంకలనాలు, చరిత్ర రచనలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, బాలసాహిత్యం చదివేవారు. పాపులర్ రచనలైతే ఆ డిమాండ్ వేరేగా ఉండేది. అప్పట్లో వచ్చే వారపత్రికలు, దినపత్రికల్లో సీరియల్‌గా వచ్చే నవలల కోసం పాఠకులు ఎదురుచూసేవారు. అన్నీ దాచుకుని, సీరియల్ అయిపోగానే ఆ పేపర్లను ప్రత్యేకంగా నవలగా బైండింగ్ చేయించుకునేవారు. విజయవాడకన్నా ముందే 1950ల్లో తెనాలి ప్రచురణ కేంద్రంగా విరాజిల్లింది. సుప్రసిద్ధ కవులు, రచయితలకు నిలయమైంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ లైబ్రరీల నిర్వహణ సరిగా లేక పుస్తక పఠనం తగ్గింది.
‘పుస్తకాలను ప్రేమించండి. అవి మీ జీవితాన్ని సుఖమయం చేస్తాయి. భావాల, ఉద్రేకాల, సంఘటనల, భయంకర గందరగోళంలో నుంచి బయటపడేసేందుకు మీకు అవి స్నేహపూర్వకమైన సలహాలనిస్తాయి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం, పరులను గౌరవించడం నేర్పుతాయి. హృదయాన్ని, మేధస్సును, మనిషిపట్ల, ప్రపంచం పట్ల ప్రేమతో నింపివేస్తాయి’
– మాక్సీమ్ గోర్కీ
నవతరం పుస్తక పఠనం నుంచి దారిమళ్లింది. సంపాదనే ముఖ్యమైంది. మానవీయ విలువలపై అవగాహన లేకుండాపోయింది. తెలుగు భాషాసంస్కృతులపై చిన్నచూపు ఏర్పడింది. వ్యక్తిగత స్వార్థం పెరిగి, సాహిత్య పఠనం లేక జరుగుతున్న అనర్థాలివి. గ్రంథాలయాలను ఆధునికీకరించి, పుస్తకాలన్నీ అందుబాటులో ఉంచేలా చేసినపుడే మంచి రోజులొస్తాయి. మా ప్రయత్నం అందుకే.
– వల్లూరు శివప్రసాద్, కన్వీనర్,
గ్రంథాలయాల పునర్వికాస ఉద్యమ వేదిక
రానురాను కాలం మారుతూ పుస్తకానికేసి చూడడం తగ్గిపోయింది. పిల్లలకు సామాజిక పరిజ్ఞానం, సాహిత్యంపై అభిలాష, చారిత్రక నేపథ్యంపై ఆసక్తిని కలిగించేలా పెద్దల జీవనశైలి ఉండటం లేదు. చిన్నతనం నుంచి పుస్తకాల్ని చదివించాల్సిన అవసరాన్ని గుర్తించటంలో ఇంటి నుంచి బడి వరకు అంతా విఫలమయ్యారు. కార్పొరేట్ పాఠశాలల రంగప్రవేశం, ర్యాంకుల వైకుంఠపాళీలో పిల్లలకు స్కూలు క్లాసులతోనే పొద్దుపోతోంది. కంప్యూటర్ సైన్స్ కోర్సులతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడ చూసినా ఇంజినీరింగే. జనరల్ నాలెడ్జి, కరెంట్ ఎఫైర్స్ కోసం కూడా వీళ్లు చదవడం లేదంటే అతిశయోక్తి కాదు. ‘గూగుల్ తల్లి’నే అన్నీ అడుగుతున్నారు. మారిన కాలంలో సాఫ్ట్‌వేర్ కొలువులు పుస్తకానికి తీసుకొచ్చిన తంటా ఇది.
కాలం మారింది.. చదవడం తగ్గింది
పుస్తక పఠనం మా‘నేస్తమా’!
ప్రతి పుట.. ఓ పాఠం..!
పఠిస్తే నిత్య వికాసం
సృజనకు అదే మార్గం
జీవితానికీ ఓ దారిదీపం
ప్రజల ఆదరణ, ప్రభుత్వ
సహకారం తోడైతేనే పూర్వవైభవం
ప్రభుత్వ సహకారం ఉంటేనే పుస్తకానికి మనుగడ లభిస్తుంది. లైబ్రరీల ద్వారా పుస్తకాలు కొనుగోలు చేయించాలి. ఎప్పటికప్పుడు డబ్బులు విడుదల చేయాలి. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో లైబ్రరీలను ఏర్పాటుచేయాలి. వాటికీ పుస్తకాలు సరఫరా చేయాలి. వీటితోపాటు మూడేళ్లక్రితం కొనుగోలు చేసిన పుస్తకాలకు డబ్బులు వెంటనే విడుదల చేయాలి.
– బి.రవికుమార్,
నవరత్న బుక్‌హౌస్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment