ఎప్పటికప్పుడు పోస్టుపోన్!
గుంటూరు మెడికల్: అంతా మా ఇష్టం.. ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవరు? అన్నట్లుగా గుంటూరు జీజీహెచ్ పరిపాలన అధికారులు వ్యవహరిస్తున్నారు. తమకు నచ్చకపోతే ఐదేళ్లుగా పోస్టు ఖాళీగా ఉన్నా ప్రమోషన్ ద్వారా భర్తీ చేయరు. తమకు నచ్చితే పోస్టు ఖాళీ ఏర్పడి పదిరోజులే అయినా నోటిఫికేషన్ ఇచ్చి ప్రమోషన్ ద్వారా భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తారు. ఆస్పత్రి అధికారులు పక్షపాత ధోరణితో సకాలంలో ప్రమోషన్లు రావటం లేదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరేళ్లుగా ఖాళీ
గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఆరేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల్లో కొన్నింటిని ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. అయినా ఆస్పత్రి అధికారులు తాత్సారం చేస్తున్నారు. ప్రమోషన్ కోసం కోర్టుకు వెళ్లిన వారికి మాత్రమే జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇచ్చారు. మిగతావారికి ఉద్యోగోన్నతి ఇవ్వలేదు. దీంతో మిగతా సిబ్బంది మళ్లీ కోర్టును ఆశ్రయించారు. సీఎంకు, కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఆస్పత్రి అధికారులు పోస్టుల భర్తీకి ఆసక్తి చూపడం లేదు.
2021 నుంచి రికార్డు అసిస్టెంట్ లేరు
ఆస్పత్రిలో రికార్డు అసిస్టెంట్ పోస్టు 2021 మే నుంచి ఖాళీగా ఉంది. ఆస్పత్రిలో పలువురు నాలుగో తరగతి ఉద్యోగులు ఈ పోస్టుకు అర్హత కలిగి ఉన్నారు. ప్రమోషన్ కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా అధికారులు కరుణించడం లేదు.
స్వప్రమోషన్ల కోసం పాకులాట
కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాల్సిన కార్యాలయ అధికారులు వాటిని ఎప్పటికప్పుడు పోస్టుపోన్ చేస్తూ తమ ప్రమోషన్ల కోసం పదే పదే సెక్రటేరియట్ చుట్టూ, డీఎంఈ కార్యాలయం చుట్టూ తిరిగి సాధించుకుంటున్నారు. భర్తీ చేయాల్సిన పోస్టుల జాప్యంపై అసిస్టెంట్ డైరెక్టర్ పాల్ సుధాకర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా రెండు వారాల్లో రికార్డు అసిస్టెంట్ పోస్టును, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.
అంతా మా ఇష్టం
ప్రమోషన్ పోస్టుల్లో పక్షపాతం
ఏళ్లతరబడి కొన్ని భర్తీ చేయటం లేదు
జీజీహెచ్ అధికారుల పనితీరుపై
విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment