ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల
గుంటూరు మెడికల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం పరిధిలో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు, డీఈఓ, ఎల్‌జీఎస్ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును విడుదల చేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా తగు ధ్రువపత్రాలతో ఈనెల 7 నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో తెలియజేయాలన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టును గుంటూరు.ఏపీ.జీఓవి.ఇన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పండుగను పునస్కరించుకుని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ మంగళవారం తెలిపారు. కాకినాడటౌన్–వికారాబాద్(07205) ప్రత్యేక రైలు ఈనెల 9న కాకినాడ టౌన్ స్టేషన్ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు వికారాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుందని వివరించారు. వికారాబాద్–శ్రీకాకుళం రోడ్డు(07207) ప్రత్యేక రైలు ఈనెల 10న సాయంత్రం ఐదు గంటలకు వికారాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌కు చేరుకుంటుందని వెల్లడించారు. శ్రీకాకుళం రోడ్డు–చర్లపల్లి( 07208) ప్రత్యేక రైలు ఈనెల 11న శ్రీకాకుళం రోడ్డు వద్ద మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి చర్లపల్లి స్టేషన్‌కు మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు చేరుకుంటుందని పేర్కొన్నారు.
స్కౌట్స్‌తో దేశభక్తి,
సేవాభావం పెంపు
గుంటూరు డీఈవో సీవీ రేణుక
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో దేశభక్తి, సేవాభావం పెంపొందించేందుకు స్కౌట్స్, గైడ్స్ శిక్షణ దోహదం చేస్తుందని గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక పేర్కొన్నారు. మంగళవారం పాత బస్టాండ్ సెంటర్‌లోని జిల్లా పరీక్షా భవన్‌లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల ఉపాధ్యాయులకు బిగినర్స్ కోర్స్ ఫర్ స్కౌట్ మాస్టర్స్, గైడ్ కెప్టెన్స్ కోర్సు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా డీఈవో రేణుక మాట్లాడుతూ క్రమశిక్షణ, పరోపకారం, సోదరభావం పెంపొందించడంలో తోడ్పడుతుందని, ప్రతి పాఠశాలలో స్కౌట్స్ యూనిట్ చేయాలని సూచించారు. స్కౌట్స్, గైడ్స్ ఎస్‌ఓసీ పి.శ్రీనివాసరావు, కార్యదర్శి చంద్రిక, ఎం.శ్రీహరి, పి.నరేష్ పాల్గొని శిక్షణ కల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ సీహెచ్ రమేష్‌ను సత్కరించారు.
ఎస్సీ కులగణనపై 12వరకు అభ్యంతరాల స్వీకరణ
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించిందని ఎస్సీ వెల్ఫేర్ డీడీ డి. మధుసూదనరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి ఈ నెల 7వ తేదీతో ముగిసిందని చెప్పారు. దీంతో ప్రభుత్వం మరో ఐదురోజులు పొడిగించిందని వివరించారు. 12 వరకు స్వీకరించిన వివరాలను ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా జనవరి 16వ తేదీ వరకు అధికారులు నమోదు చేస్తారని చెప్పారు. అనంతరం అన్ని తనిఖీలూ పూర్తి చేసి తుది కులగణన సర్వే వివరాలను జనవరి 20న గ్రామ, వార్డు సచివాలయాల వద్ద విడుదల చేస్తారని వివరించారు.
యార్డుకు 76,310
బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 76,310 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 72,819 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి రూ. 14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.7,200 నుంచి 16,500 వరకు లభించింది. ఏసీ కామన్ రకం మిర్చి రూ. 8,000 నుంచి రూ. 13,500 వరకు లభించింది. ఏసీ ప్రత్యేక రకం రూ. 7,500 నుంచి రూ. 15,500 వరకు ధర పలికింది.
Comments
Please login to add a commentAdd a comment