అక్రమ కేసులు పెట్టి వేధిస్తే మూల్యం తప్పదు
నరసరావుపేట: రాష్ట్రంలో ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ వారిని హెచ్చరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని సబ్‌జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న రొంపిచర్ల మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గంటా కోటేశ్వరరావు, ఆయన సోదరులను మంగళవారం గోపిరెడ్డి పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సార్ సీపీ నాయకులైన కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గంటా కోటేశ్వరరావు, ఆయన సోదరులు గంటా కొండలు, గంటా చిన్న కోటేశ్వరరావులపై టీడీపీ వారు అన్యాయంగా, అక్రమ కేసులు బనాయించి రిమాండ్‌కు పంపించారన్నారు. గ్రామంలోని ఎస్‌సీ కాలనీలో 35 కుటుంబాల వారు వైఎస్సార్ సీపీవైపు ఉంటే.. కేవలం తొమ్మిది కుటుంబాల వారు టీడీపీలో ఉన్నారన్నారు. గతేడాది డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా కాలనీలోని చర్చిలో ప్రార్థనలకు వైఎస్సార్‌సీపీ వారిని రానీయకుండా టీడీపీ వర్గీయులు అధికార బలంతో అడ్డుకున్నారన్నారు. డిసెంబర్ 31వ తేదీన నూతన సంవత్సర ప్రార్థనలకు సైతం అడ్డుకున్నారని చెప్పారు. స్టేషన్‌కు ఎస్‌ఐ పిలిచి 31వ తేదీ రాత్రి 11 గంటలకు వరకు టీడీపీ వారు, ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ వర్గీయులు ప్రార్థన చేసుకునేలా రాజీ చేశారని అన్నారు. టీడీపీ వారి ప్రార్థన ముగిసిన తర్వాత కూడా వైఎస్సార్‌సీపీ వారిని అడ్డుకున్నారని చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య చిన్న గొడవ జరిగిందన్నారు. ఇరువర్గాలపై 324 సెక్షన్ కేసు నమోదు చేశారని చెప్పారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు అంటే సుమారు ఎనిమిది నెలల క్రితం పెట్టిన ఒక కేసుకు తప్పుడు సర్టిఫికెట్ జత చేసి 324 సెక్షన్‌ను మార్చి 326 సెక్షన్‌గా చేసి గ్రామ సర్పంచ్ అని కూడా చూడకుండా గంటా కోటేశ్వరరావు, ఆయన ఇద్దరు సోదరులను అన్యాయంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. ఇలా పాత కేసులలో సెక్షన్లు మార్చి తమ పార్టీ వారిని జైళ్లకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, రేపు పరిస్థితి ఏంటనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని టీడీపీ వారిని హెచ్చరించారు. కొత్తపల్లి గ్రామ నాయకులు ఇగ్గుటూరి రంగారెడ్డి, ముచ్చుమర్రి వెంకటేశ్వరరెడ్డి, దాసరిపల్లి పెద సాంబిరెడ్డి, పడాల హనిమిరెడ్డి పాల్గొన్నారు.
టీడీపీ నాయకులను హెచ్చరించిన
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి
అక్రమ కేసులో సబ్‌జైలులో ఉన్న
సర్పంచ్, ఆయన సోదరులకు
పరామర్శ
వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను
కాపాడుకుంటామని భరోసా
Comments
Please login to add a commentAdd a comment