బీమా ప్రీమియంపై జీఎస్టీ రద్దుకు డిమాండ్
కొరిటెపాడు(గుంటూరు): బీమా ప్రీమియంపై కేంద్ర ప్రభుత్వం 18 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి వీవీకే సురేష్ డిమాండ్ చేశారు. గుంటూరు అరండల్‌పేటలోని ఎల్‌ఐసీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ విధించడం వల్ల కోట్లాది మంది ఈ సౌకర్యాన్ని పొందలేకపోతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని ఎత్తివేయని పక్షంలో ఏజంట్స్, పాలసీదారుల సహకారంతో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. బీమా రంగాన్ని మరింత శక్తిమంతం చేస్తే జీడీపీలో ప్రీమియం వాటా పెరుగుతుందని చెప్పారు. ప్రీమియంలపై విధిస్తున్న జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఇన్సైరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 300 మందికిపైగా ఎంపీలు, అనేక మంది కేంద్ర మంత్రులను కలసి వినతిపత్రాలను అందజేసినట్లు తెలిపారు. అసోసియేషన్ నాయకులు జానీ మాట్లాడుతూ ప్రజాసంక్షేమానికి ఎల్‌ఐసీ అంకితమైందని స్పష్టం చేశారు. అసోసియేషన్ నాయకురాలు సీహెచ్ మధుబాల మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బీమా రంగంలో విదేశీ వాటాను వంద శాతానికి పెంచాలని నిర్ణయించిందని అన్నారు. ఎల్‌ఐసీని కాపాడుకునేందుకు ఉద్యోగులు, ఏజంట్లు పోరాటం కొనసాగిస్తారన్నారు. సమావేశంలో అసోసియేషన్ నాయకులు నాగేంద్రరెడ్డి, గోపాలకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment