కాంప్లెక్స్ పోయే క్లస్టర్ విధానం వచ్చే!
సత్తెనపల్లి: విద్యాశాఖకు సంబంధించి పాఠశాల సముదాయాల స్థానంలో (కాంప్లెక్స్) క్లస్టర్ విధానాన్ని అమలు చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాల పరిధిలో 14 స్కూల్ కాంప్లెక్స్‌లను 12 క్లస్టర్లుగా ఏర్పాటు చేసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రతి క్లస్టర్‌కు గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 10 నుంచి 15 పాఠశాలలను అనుసంధానం చేసేలా విద్యాశాఖ మార్గ దర్శకాలు జారీ చేసింది. క్లస్టర్‌లో 40 నుంచి 50 మంది ఉపాధ్యాయులు సభ్యులుగా ఉంటారు. ఇకపై ప్రతి నెల పాఠశాల కాంప్లెక్స్ సమావేశాలు కొత్త విధానంలో నిర్వహించ నున్నారు. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ, పాఠశాలల మధ్య విద్య అనుసంధానం, విద్యా వనరుల సామగ్రి తయారీ, తనిఖీలు, విద్యా వ్యవస్థ పర్యవేక్షణ తదితర కార్యక్రమాలు క్లస్టర్ కేంద్రంగా నిర్వహించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రధానోపాధ్యాయులే కీలకం
కొత్త విధానంలో క్లస్టర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కీలకంగా మారనున్నారు. మండల యూనిట్‌లో ప్రస్తుతం డీడీఓ అధికారాలు మండల విద్యాశాఖాధికారులు (ఎంఈఓ)లకు ఉండగా ఇకపై ఈ విధానానికి స్వస్తి పలికి త్వరలో క్లస్టర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు జీతాల పంపిణీ అధికారం బదలాయింపు చేయనున్నారు. ఎంఈఓలు పరిపాలన సంబంధ అంశాలకు మాత్రమే పరిమితం కానున్నారు. క్లస్టర్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులపై ప్రస్తుతం ఉన్న రోజువారీ విధులకు అదనంగా క్లస్టర్ నిర్వహణ భారం పడటంతోపాటు మండల విద్యాశాఖ అధికారులు నిర్వహిస్తున్న డీడీఓ బాధ్యతలను కూడా క్లస్టర్ ప్రధాన ఉపాధ్యాయులకే ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
సీఆర్పీల భవిష్యత్తు ప్రశ్నార్థకం
ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే స్కూల్ కాంప్లెక్స్‌లను కూటమి ప్రభుత్వం తగ్గించనుంది. ఈ నేపథ్యంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను కూడా తగ్గించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు కాంప్లెక్స్‌లో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సీఆర్పీలకు బీఈడీ అర్హత ఉండటంతో గత ప్రభుత్వం క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లు (సీఆర్‌ఎంటీ)గా గుర్తింపు ఇవ్వడంతోపాటు మండలంలో ఎక్కడైనా ఉపాధ్యాయులు సెలవులో ఉన్నప్పుడు బోధనకు అంతరాయం లేకుండా వీరు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంది. ఇప్పుడు క్లస్టర్ విధానం అమల్లో వీరి పరిస్థితి ఏమవుతుందనేది స్పష్టంగా తెలియ రావడం లేదు.
సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇలా....
సత్తెనపల్లి మండలానికి సంబంధించి పణిదం, రెంటపాళ్ళ, బృగుబండ, నందిగం, కొమెరపూడి, పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, సుగాలీ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు కలిపి ఏడు కాంప్లెక్స్‌గా ఉండగా .. ప్రస్తుతం కొమెరపూడిని నందిగామలో విలీనం చేసి ఆరు క్లస్టర్లుగా మార్చారు. బృగుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదులుగా ధూళ్ళిపాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మార్చారు.
ముప్పాళ్ళ మండలానికి సంబంధించి నార్నెపాడు, ముప్పాళ్ళ, మాదల కలిపి మూడు కాంప్లెక్స్‌లుగా ఉండగా నార్నెపాడును తొలగించి దమ్మాలపాడు, ముప్పాళ్ళ, మాదల మూడింటిని కలిపి క్లస్టర్లుగా మార్చారు.
రాజుపాలెం మండలానికి సంబంధించి గణపవరం, అనుపాలెం, పెదనెమిలిపురి, రాజుపాలెం పాఠశాలలు కలిపి నాలుగు కాంప్లెక్స్‌లు ఉండగా అనుపాలెంను రాజుపాలెం మండలంలో విలీనం చేశారు.కోటనెమిలిపురి, పార్వతిపురంలోని ఐదు పాఠశాలలను పెదనెమిలిపురిలో విలీనం చేశారు.
నకరికల్లు మండలానికి సంబంధించి గుండ్లపల్లి, నకరికల్లు, కండ్లకుంట, కుంకల గుంట పాఠశాలలు కలిపి నాలుగు కాంప్లెక్స్‌లుగా ఉండగా వీటిని యథావిధిగా నాలుగు క్లస్టర్లుగా కొనసాగిస్తున్నారు.
స్కూల్ కాంప్లెక్స్‌లను క్లస్టర్లుగా విలీనం క్లస్టర్ ప్రధానోపాధ్యాయులకు అధికారాలు నియోజకవర్గంలో 18 కాంప్లెక్స్‌లను16 క్లస్టర్లుగా కుదింపు
వనరుల సమర్థ వినియోగమే లక్ష్యం
కాంప్లెక్స్ స్థానంలో క్లస్టర్ విధానం రావడం వల్ల ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణ పెరుగుతుంది. ఉపాధ్యాయులలో నైపుణ్యాలు పెరిగి బోధనకు దోహదపడ తాయి. ముఖ్యంగా వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. –ఎ.శ్రీనివాసరావు, మండల విద్యాశాఖాధికారి, సత్తెనపల్లి
Comments
Please login to add a commentAdd a comment