జీవితానికి భరోసా | - | Sakshi
Sakshi News home page

జీవితానికి భరోసా

Published Mon, Jan 20 2025 1:37 AM | Last Updated on Mon, Jan 20 2025 1:37 AM

జీవిత

జీవితానికి భరోసా

ఇంగ్లిషు విద్యతో

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: చదువు ముఖ్యం. అది మాతృభాషలోనైనా, పరాయిభాషలో అయినా. మాతృభాష స్థానికంగా, ఇంగ్లిషు విశ్వ వ్యాప్తంగా అవకాశాలను కల్పిస్తుంది. అందువల్లే ఆంగ్లానికి ప్రాధాన్యం పెరిగింది. జీవితానికి భరోసా తప్పకుండా ఇస్తుంది. నాలాంటి పేదింటి పిల్లలు ఆంగ్లంతో పడిన కష్టాలు ఇతరులకు రాకూడదనే ఉద్దేశంతో పదిహేనేళ్ల పాటు గ్రామస్తుల సహకారంతో మా ఊర్లో ట్యూషన్లు చెప్పించామంటారు రిటైర్డ్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి మోపర్తి ప్రకాశరావు. ఆంధ్రప్రదేశ్‌లోని పదో తరగతి విద్యార్థులు 93 శాతం మంది ఇంగ్లిషు మీడియంలో పబ్లిక్‌ పరీక్షలు రాయడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడం సాధారణ విషయం కాదు. వారందరికీ ముందస్తు శుభాకాంక్షలు. వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం విద్యకు ఇచ్చిన ప్రాధాన్యానికి ఇదొక నిదర్శనం. నాడు– నేడు ద్వారా విద్యాసంస్థల్లో రూపురేఖలు మార్చడానికి, వసతులు, వనరులు పెరగడానికి, ఉపాధ్యాయుల్లో మరింత నిబద్ధతను పెంపొందించడానికి ఉపకరించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

మోపర్తి ప్రకాశరావు మాటల్లో..

మాది పూర్వపు గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం బోడపాడు గ్రామం. నా వయసు ఇప్పుడు 83. జూనియర్‌ సివిల్‌ జడ్జిగా 23 ఏళ్ల కిందట రిటైరయ్యాను. తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల వారు విద్య ప్రాధాన్యాన్ని గుర్తెరిగిన వారు. పేద కుటుంబానికి చెందిన నాకూ చదువుకునే అవకాశాన్ని తల్లిదండ్రులు కల్పించారు. మాతృభాషలో విద్యనభ్యసించిన నేను ఇంగ్లిషులో కనీస ప్రావీణ్యతకు కుస్తీ పట్టక తప్పలేదు. ఆ దృష్ట్యానే బిడ్డలకు ఇంగ్లిషు చదువుల అవసరాన్ని గుర్తించాను. ఆంగ్లంలో చదువుకుంటే అంతర్జాతీయంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయనడంలో సందేహం లేదు.

నాటికి, నేటికి పరిస్థితులు వేరు..

పూర్వం ప్రభుత్వ బడులలో ఉపాధ్యాయులు బాధ్యతగా చదువు చెప్పేవారు. అందుకు ప్రధాన కారణం ప్రైవేటు బడులు లేకపోవడం. ఉన్నత వర్గాల వారి పిల్లలు ఆ బడుల్లోనే చదువుకోవాల్సిన తప్పని పరిస్థితి. దీంతో గ్రామాల్లోని మోతుబరులు, అగ్రవర్ణాల వారు పంతుళ్లు చదువులు ఎలా చెపుతున్నారనే దానిపై ఓ కన్నేసి ఉంచేవారు. వారి పిల్లలతోపాటు నాలాంటి పేదింటి పిల్లలకు కూడా చదువు అబ్బేది. ప్రైవేటు కాన్వెంట్లు వచ్చాక గవర్నమెంట్‌ బడుల స్థితిగతులు మారాయి. ప్రభుత్వాలు అంతగా దృష్టి పెట్టలేకపోయాయి.

మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు శభాష్‌... పదో తరగతి పిల్లలు ఇంగ్లిషు మీడియంలో పరీక్షలకు సిద్ధమవడం అభినందనీయం స్వగ్రామంలో 15 ఏళ్లపాటుట్యూషన్లు చెప్పించాం.. తమ వర్గాల అభ్యున్నతికి అట్టడుగు జాతులూ కృషి చేయాలి ‘సాక్షి’తో రిటైర్డ్‌ జడ్జి మోపర్తి ప్రకాశరావు

జగన్‌ పేదింటి పిల్లల అవసరాలను గుర్తించారు..

పే బ్యాక్‌ టు సొసైటీ..

అంబేడ్కర్‌ ఆశయాల మేరకు, ఆయన పిలుపు ప్రకారం ప్రతి ఒక్కరూ సొసైటీకి తిరిగి ఇచ్చేయాలి (పే బ్యాక్‌ టు సొసైటీ). ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో చదువుకున్న వారు, ఉద్యోగాలు చేసేవారు, రిటైర్‌ అయిన వారుంటారు. ఎవరంతట వారు, తమ ఆదాయంలో ఒకటి, రెండు శాతం పేద పిల్లలకు మెరుగైన చదువు చెప్పించటానికి వెచ్చించగలిగితే మంచిది. అదే సమాజానికి వారు చేసే పెద్ద మేలవుతుంది. విద్య ఉంటే మెజార్టీ వ్యక్తుల్లో మంచి మాట, ప్రవర్తన, జీవనం ఉంటుంది. వ్యసనాలు దరిచేరవు. తనతోపాటు కుటుంబం, తద్వారా సమాజం బాగుపడుతుంది. మా వరకు దాదాపు పదిహేనేళ్లపాటు పొన్నూరు నుంచి మాస్టర్లను పిలిపించి బోడపాడులోని ప్రైమరీ, హైస్కూల్‌ విద్యార్థులకు ప్రైవేటుగా ట్యూషన్లు చెప్పించాం. కరోనా వల్ల ఆ ప్రక్రియ ఆగింది. ఇప్పుడేమో వయసు పెరిగినందున హైదరాబాద్‌ వచ్చా. అయినా పొన్నూరు, చీరాల నుంచి మాస్టర్లను పిలిపించి కనీసం ఇంగ్లిషు, మ్యాథ్స్‌ సబ్జెక్టులకు ట్యూషన్లు చెప్పించాలనే ఆలోచనల్లో ఉన్నాం. ఎంతవరకు సాధ్యమో చూడాలి. విద్యావంతులు పల్లెల వైపు దృష్టి సారించాలి, వాటి బాగుకు యత్నించాలని విన్నవించారు మోపర్తి ప్రకాశరావు.

తన సుదీర్ఘ పాదయాత్రలో పేదల స్థితిగతులను, వారి అవసరాలను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టంగా గుర్తించారు. బహుశా అందుకే విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేకంగా దృష్టి సారించారనిపిస్తుంది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు విద్య అవసరాన్ని గుర్తించే ప్రాధాన్యమిచ్చారు. సజావుగా ఆలోచించే టీచర్లు తమ బాధ్యతలను గుర్తించి పనిచేశారు. ఆ ఫలితమే ఈ దఫా 93 శాతం మంది పదో తరగతి విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలకు సంసిద్ధత వ్యక్తం చేయడం. ప్రస్తుత ప్రభుత్వం కూడా పేద పిల్లల బాగు కోసం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
జీవితానికి భరోసా1
1/1

జీవితానికి భరోసా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement