ఫిబ్రవరి నుంచి నియోజకవర్గ స్థాయిలో పీజీఆర్‌ఎస్
నరసరావుపేట: ఇప్పటివరకు జిల్లా స్థాయిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను ఫిబ్రవరి ఒకటి నుంచి నియోజకవర్గ స్థాయిలో కూడా అందుబాటులోకి తెస్తామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గడిచిన ఆరు నెలల్లో నిర్వహించిన కార్యక్రమాలు, జిల్లా అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. ఒక సోమవారం జిల్లా స్థాయిలో, మరో సోమవారం ఏదేని ఒక నియోజకవర్గంలో పీజీఆర్‌ఎస్ నిర్వహిస్తామన్నారు. అవసరమైతే మండల స్థాయికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్‌ను నియమించినట్లు చెప్పారు. మున్ముందు మండల స్పెషల్ ఆఫీసర్లతో పరిష్కారాలపై ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటివరకు 11,176 పిటిషన్లు రాగా.. వాటిలో 7,258 పరిష్కరించినట్లు తెలిపారు. రెవెన్యూ, పోలీసు, సర్వే, పంచాయతీ రాజ్ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించే విధానానికి బదులుగా వచ్చే ఏడాది నుంచి తరగతుల సంఖ్య ఆధారంగా కేటాయిస్తామని వెల్లడించారు. ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌లో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గదని స్పష్టం చేశారు. పదవ తరగతిలో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు ’లక్ష్య సాధన ’ పేరుతో విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేయనున్నామని చెప్పారు. మంచానికి పరిమితమైన వారికి అందించే రూ.15 వేల ఫించన్ పూర్తిగా అర్హులకు మాత్రమే అందించేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో తొలుత ప్రభుత్వ భూముల రీ సర్వే కొనసాగుతోందని, ప్రతి గ్రామంలో సరిహద్దులను నిర్ణయించి అనంతరం పూర్తిస్థాయిలో ప్రైవేటు భూముల సర్వే చేపడతామని వివరించారు. గతంలో జరిగిన తప్పులను పరిష్కరిస్తామని చెప్పారు. శిశువుల ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కోసం అంగన్ వాడీ స్థాయిలోనే ఆధార్ క్యాంపులు మంగళవారం నుంచి శుక్రవారం వరకూ కొనసాగుతాయని పేర్కొన్నారు. జిల్లాలో పర్యాటక అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని, నాగార్జునసాగర్ వద్ద విమానాశ్రయం ఏర్పాటుపై అధికారులు పరిశీలించారని చెప్పారు. నాగార్జునసాగర్ వద్ద విజయపురి సౌత్ నివాసస్థలాన్ని నీటి పారుదల శాఖ నిర్వహించలేని పరిస్థితి ఉందని, ఆ గ్రామానికి గ్రామ పంచాయతీ హోదా ఇచ్చి పర్యాటక రంగం అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశామన్నారు. యల్లమంద గ్రామాల్లో పట్టలు కుట్టే వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు, రుణాల పంపిణీ ద్వారా ఉపాధి, వ్యాపార అవకాశాలు పెంచేందుకు జిల్లా అధికారులతో కమిటీ నియమించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో లెదర్ పరిశ్రమ ఏర్పాటుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో భూముల పరిశీలన జరిగిందని చెప్పారు. దుర్గిలో నిలిచిపోయిన లెదర్ పరిశ్రమ ఏర్పాటును కొనసాగించే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ ఒకటి నుంచి కనీసం మండలానికి ఒక కిసాన్ డ్రోన్ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశామని, జిల్లాకు మొత్తం 40 డ్రోన్లు మంజూరయ్యాయని వివరించారు. రైతు బృందాలకు శిక్షణ ఇచ్చి మండలానికి కనీసం ఒక డ్రోన్ నిర్వాహకుడు ఉండేలా చూస్తున్నామన్నారు. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితులను మెరుగుపరిచేందుకు సీఎస్సార్ నిధులను వినియోగిస్తామని వివరించారు. ఫిబ్రవరి నాటికి జిల్లాలో మొత్తం 426 చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే, డీఆర్వో మురళి పాల్గొన్నారు.
గణతంత్ర దిన వేడుకల ఏర్పాట్లపై సమీక్ష
నరసరావుపేట: ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర దిన వేడుకలు పండుగ వాతావరణంలో జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో దీనికి సంబంధించి అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పరేడ్ గ్రౌండ్‌లో ఈ వేడుకలకు సకాలంలో అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రజా ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, జిల్లా అధికారులు, ప్రజల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేయాలని సూచించారు. పార్కింగ్ ఏర్పాట్లు సక్రమంగా చేయాలని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, శకటాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అవార్డులు అందించే వారి కోసం సర్టిఫికెట్ ఫైనలైజ్ చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్, డీఆర్వో ఎ.మురళి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో
ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ
టెన్త్‌లో ఉత్తీర్ణతా శాతం
పెంచేందుకు ‘లక్ష్య సాధన’
విలేకరుల సమావేశంలో
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
Comments
Please login to add a commentAdd a comment