క్రైస్తవ భూములపై ‘పచ్చ’ నేతల కన్ను
సాక్షి నరసరావుపేట: పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో గుంటూరు – కర్నూలు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న రూ. వంద కోట్లకుపైగా విలువ చేసే బాప్టిస్టు చర్చి స్థలంలో ఉన్న శిలువను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై క్రైస్తవ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు మూడు ఎకరాలకుపైగా పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ విలువైన స్థలంపై అక్రమార్కుల కన్నుపడింది. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఆక్రమణకు గురైన ఈ స్థలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత క్రైస్తవులు శిలువ ఏర్పాటు చేసుకుని చర్చి నిర్మించుకునేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చింది. దీంతో స్థలాన్ని ఆక్రమించేందకు అక్రమార్కులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే శిలువను ధ్వంసం చేయడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న బాప్టిస్టు చర్చి సంఘీయులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డీఎస్పీ, తహసీల్దార్‌లకు వినతి
క్రైస్తవ ఆస్తులను ఆక్రమించేందుకు యత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, తహసీల్దార్‌లను కలిసి పలువురు క్రైస్తవ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. బాప్టిస్టు సంఘ కార్యదర్శి జి.ఆశీవరప్రసాదు, ఉపకార్యదర్శి కె.వినోద్, మున్సిపల్ వైస్ చైర్మన్ బేతం గాబ్రియేలు, జాషువా, ఫిలిప్, జోసఫ్, ప్రసాదులు ఈ మేరకు అధికారులకు ఫిర్యాదు చేశారు.
కోర్టు ఆదేశాలూ బేఖాతర్
గత కొన్నేళ్ల నుంచి ఏబీఎం (ఆంధ్రా బాప్టిస్టు మిషన్) ఆస్తులపై వివాదాలు కొనసాగుతుండగా కొందరు కోర్టును ఆశ్రయించారు. అయితే ఇటీవలకాలంలో మద్రాసు హైకోర్టు ఏబీఎం ఆసుల అమ్మకాలు చెల్లవని, బాప్టిస్టు చర్చి కమిటీల ఆధ్వర్యంలో ఆస్తులను పరిరక్షించాలని తీర్పునిచ్చింది. అయితే కోర్టు ఆదేశాలను కూడా బేఖాతర్ చేస్తూ రాత్రికి రాత్రే ఆక్రమణకు టీడీపీ నాయకులు పూనుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మాజీ ఎమ్మెల్యే బొల్లా ఖండన
క్రైస్తవ ఆస్తుల ఆక్రమణ యత్నాలను ఖండిస్తున్నట్లు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో క్రైస్తవుల ఆస్తులు సురక్షితంగా ఉన్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్రైస్తవ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. టీడీపీ నాయకులే ఆక్రమించడం దారుణమని పేర్కొన్నారు. క్రైస్తవ ఆస్తుల రక్షణకు తమ మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
వినుకొండ నడిబొడ్డున శిలువ ధ్వంసం
రూ.వంద కోట్లకుపైగా విలువైన
భూఆక్రమణకు పన్నాగం
కూటమి ప్రభుత్వం రాగానే
మొదలైన దందా
అక్రమార్కులపై చర్యలకు
ౖక్రెస్తవ సంఘాల డిమాండ్
బాధితులకు అండగా ఉంటామని
మాజీ ఎమ్మెల్యే బొల్లా హామీ
Comments
Please login to add a commentAdd a comment