ముప్పాళ్ల: బాలికకు మాయమాటలు చెప్పి ప్రలోభాలకు గురి చేసి ఆమెను పెళ్లి చేసుకున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వి.సోమేశ్వరరావు శుక్రవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన ఓ కుటుంబం వ్యవసాయ పనుల నిమిత్తం మండలంలోని రుద్రవరం గ్రామానికి వచ్చింది. అలాగే అమర్తలూరు మండలానికి చెందిన రాపూరి శ్రీనివాసరావు తన భార్య, రెండేళ్ల కుమారుడితో అదే గ్రామానికి వ్యవసాయ పనులకు వచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామం నుంచి వచ్చిన కుటుంబంలోని బాలికకు మాయ మాటలు చెప్పి ప్రలోభాలకు గురి చేశాడు. ఫోన్ కూడా కొనిచ్చాడు. తరచూ ఎవరికి తెలియకుండా ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉండేవారు. వ్యవసాయ పనులు ముగియటంతో ఇరు కుటుంబాల వారు ఎవరి గ్రామాలకు వారు వెళ్లిపోయారు. రాపూరి శ్రీనివాసరావు బాలికతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ ఇరువురూ పారిపోయేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇరువురూ కలిసి జనవరి 5వ తేదీన తిరుపతి వెళ్లారు. అక్కడే పెళ్లి చేసుకొని తిరిగి మేడికొండూరు మండలం జంగంగుంట్లపాలెం వచ్చారు. అక్కడ ఓ రైతుకు చెందిన ఇల్లు అద్దెకు తీసుకొని పొలం పనులకు వెళుతున్నారు. బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదంటూ ముప్పాళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా శ్రీనివాసరావు ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించి, శ్రీనివాసరావుపై పోక్స్ కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచగా, నిందితునికి రిమాండ్ విఽధించినట్లు ఎస్సై వి.సోమేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment