మిర్చి యార్డు కార్యదర్శిగా చంద్రిక బాధ్యతల స్వీకారం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డు కార్యదర్శిగా ఎ.చంద్రిక శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. యార్డు ఇన్‌చార్జి సుబ్రమణ్యం నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించి, మొదటి ఫైల్‌పై సంతకం చేశారు. చంద్రిక మిర్చి కార్యదర్శిగా ఏడాదిపాటు డిప్యుటేషన్ మీద కొనసాగనున్నారు. చంద్రిక మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గుంటూరు మిర్చి యార్డుకు పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించుకునేందుకు యార్డుకు వచ్చే మిర్చి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని స్పష్టం చేశారు. యార్డు అధికారులు, సిబ్బంది సహకారంతో గుంటూరు మిర్చి యార్డును ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. అంతేకాకుండా ప్రస్తుత సీజన్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతామని ఆమె వివరించారు. పలువురు యార్డు అధికారులు, సిబ్బంది, పలు అసోసియేషన్ల నాయకులు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రికను కలిసి అభినందనలు తెలియజేశారు.
శ్రీవాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం
తెనాలి: స్థానిక బోసురోడ్డులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం శ్రీవాసవీ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు, శోభాయాత్ర జరిగాయి. వేకువజామునే సుప్రభాతం, విఘ్నేశ్వర పూజ నిర్వహించారు. అనంతరం సత్రం కమిటీ పాలకవర్గ సభ్యులు వైశ్య పతాకాన్ని ఆవిష్కరించారు. అమ్మవారికి 11 పర్యాయాలు పంచామృతాలు, ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా 102 మంది ఆర్యవైశ్య కన్యలచే కలశాలతో పట్టణంలో వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అమ్మ వారిని, ప్రాంగణంలోని శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి, నగరేశ్వరస్వామి వార్లను మంత్రి దర్శించుకున్నారు. మంత్రి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలు ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామీజీ) ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం కమిటీ అధ్యక్షుడు నూకల వెంకట వేణుగోపాలరావు, కార్యదర్శి బూర్లె నరసింహారావు, వుప్పల వరదరాజులు, కొణిజేటి గోపికృష్ణ, గ్రంధి విశ్వేశ్వరరావు, నాళం రజనీ కుమార్, మద్దాళి శేషాచలం, మువ్వల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
దూరవిద్య బీఎల్‌ఐఎస్‌సీ ఫలితాలు విడుదల
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ దూర విద్యా కేంద్రం గత అక్టోబర్, నవంబర్ నెలలో నిర్వహించిన బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ (బీఎల్‌ఐఎస్‌సీ) కోర్సు మొదటి, రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను శుక్రవారం దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి.వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య డి.రామచంద్రన్‌లు విడుదల చేశారు. ఫలితాలను దూరవిద్య కేంద్రం వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్లూ.ఏఎన్‌యూసీడీఈ.ఇన్‌ఫో నుంచి పొందవచ్చునని వారు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణవేణి, కోదండపాణి, ఉద్యోగులు టంకశాల వెంకటేశ్వర్లు, ఎల్ ఎస్.రాంబాబు, కంప్యూటర్ సెక్షన్ నిర్వాహకులు వలి తదితరులు పాల్గొన్నారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల): కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద శుక్రవారం 2010 క్యూసెక్కులు విడుదల చేశారు. హై లెవల్ కాలువకు 106, బ్యాంక్ కెనాల్‌కు 130, తూర్పు కెనాల్‌కు 242, పశ్చిమ కెనాల్‌కు 120, నిజాంపట్నం కాలువకు 50, కొమ్మమూరు కాలువకు 930 క్యూసెక్కులు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment