కమిషనర్‌ చెప్పారు.. తీసేశాం! | - | Sakshi
Sakshi News home page

కమిషనర్‌ చెప్పారు.. తీసేశాం!

Published Fri, Aug 23 2024 1:48 AM | Last Updated on Fri, Aug 23 2024 12:58 PM

No He

సాక్షి పార్వతీపురం మన్యం/పార్వతీపురం టౌన్‌: ఆమె ఒక చిరుద్యోగిని. పార్వతీపురం పురపాలిక సంఘ కార్యాలయంలో అవుట్‌ సోర్సింగ్‌(ఆప్కస్‌) ప్రాతిపదికన పని చేస్తోంది. కూటమి పెద్దలకే కడుపు మండిందో.. మున్సిపల్‌ అధికారులకు ఎటువైపు నుంచి ఒత్తిడి వచ్చిందోగానీ.. ఆడబిడ్డ అని జాలిచూపకుండా అమానవీయంగా రోడ్డున పడేశారు. ‘‘సార్‌.. మీరు నాకు వర్క్‌ చెప్పడం లేదు. సీటు ఇవ్వడం లేదు. ఏ పనీ చేయడం లేదని తిరిగి అంటున్నారు. నాకు ఏమీ చెప్పకుండా, నన్ను మానేసి వెళ్లిపోవాలంటే ఎలా సార్‌? మానేయమనడం తప్ప.. ఇంకేదైనా చెప్పండి సార్‌.. చేస్తాను’’ అంటూ ప్రాథేయపడుతున్నా కనికరించలేదు. నిస్సహాయ స్థితిలో గురువారం పార్వతీపురం పురపాలిక సంఘ కార్యాలయం ఆవరణలో మెట్లపై కూర్చొని తన దీనస్థితిని తలుచుకుంటూ కుమిలిపోయింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలితోపాటు.. కార్యాలయ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

పార్వతీపురం పురపాలిక సంఘ కార్యాలయంలో పి.సుమ అనే మహిళా ఉద్యోగిని సుమారు ఏడు నెలల కిందట అవుట్‌ సోర్సింగ్‌(ఆప్కస్‌) కింద విధుల్లో చేరారు. కొద్దిరోజులుగా ఆమెను విధుల నుంచి తప్పించాలని స్థానిక పెద్దల నుంచి ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రత్యేకించి ఒక చోట సీటు ఇవ్వక.. ఏ పనీ అప్పగించక మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ వేధింపులు మరింత ఎక్కువైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల కిందట వీలైతే రాజీనామా చేయాలని, లేకుంటే దీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్లిపోవాలని ఒత్తిడి చేశారు. తాను తప్పు చేస్తే విధుల నుంచి తీసేయాలని.. ఏ కారణమూ లేకుండా ఎందుకు తప్పుకుంటానని ఆమె ప్రశ్నించారు.

పై నుంచి తమపై ఒత్తిళ్లు వస్తున్నాయని కూడా ఆమె వద్ద చెప్పినట్లు సమాచారం. చివరికి సెలవు పెట్టేందుకు కూడా తను నిరాకరించడంతో మున్సిపల్‌ రెవెన్యూ అధికారి రూబెన్‌ విభాగానికి అప్పగించారు. అక్కడ కూడా అదే పరాభవం ఎదురైంది. ‘నిన్ను తీసేయాలని పై నుంచి మాకు ఒత్తిళ్లు ఉన్నాయి. నువ్వు రాజీనామా చేసేయ్‌!’ అంటూ ఓసారి.. ‘మూడు నెలలు సెలవు పెట్టి వెళ్లిపో.. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యేను కలిసి వచ్చాక చేరు..’ అంటూ మరోసారి మున్సిపల్‌ ఆర్వో రూబెన్‌ ఆమెకు స్పష్టం చేశారు. అందుకు కూడా తనకు అభ్యంతరం లేదని సదరు మహిళా ఉద్యోగిని చెప్పినప్పటికీ.. ఏకంగా రాజీనామా చేయ్‌.. అంటూ మరలా ఒత్తిడి ప్రారంభించారు. చివరికి ఆగస్టు 1 నుంచి హాజరు పట్టీలో ఆయన అనుమతి లేకుండా ఆమె సంతకం పెట్టడానికి వీల్లేదంటూ రాసేశారు.

తను మాత్రం క్రమం తప్పకుండా విధులకు హాజరవుతూ.. సంతకం పెడుతూనే వస్తోంది. దీంతో మరింత బెదిరింపులు ఎక్కువయ్యాయి. చేసేదిలేక కమిషనర్‌ శ్రీనివాస్‌ వద్ద ఆమె మొర పెట్టుకుంది. ‘లైబ్రరీలో విధులకు పంపిస్తాను.. ఇష్టమైతే వెళ్లు’ అంటూ ఆయన అనడంతో అందుకు కూడా ఉద్యోగిని అంగీకరించారు. అయితే, అందుకు సంబంధించి లిఖితపూర్వకంగానైనా, మౌఖికంగానైనా ఆదేశాలు కమిషనర్‌ ఇవ్వలేదు. లైబ్రరీలో విధుల్లో చేరేందుకు ఆమె వెళ్తే.. అక్కడ తీసుకునేందుకు వారు నిరాకరించారు. దీంతో మరలా కమిషనర్‌ వద్దకు వచ్చి మొర పెట్టుకుంటే.. అధికారికంగా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేశారు. వేధింపులకు గురవుతున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని సుమ.. వైఎస్సార్‌సీపీ నేత బంధువు కావడంతోనే ఈ విధంగా విధుల నుంచి తప్పించేందుకు ఒత్తిడి చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

కమిషనర్‌ చెప్పారు.. తీసేశాం!
తనపై కమిషనర్‌ నుంచి ఒత్తిడి వచ్చినందువల్లే ఉద్యోగినిని విధుల్లో ఉంచడం లేదని మున్సిపల్‌ ఆర్వో రూబెన్‌ చెబుతున్నట్లు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. తాను కూడా కమిషనర్‌ వద్ద పని చేస్తున్న సాధారణ ఉద్యోగేనని చెప్పారు. ఆయన ఏ పని చెబితే అదే చేస్తానని అందులో స్పష్టంగా ఉంది.

నాకు తెలియదు.. విచారణ చేస్తాం...
ఇదే విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ వద్ద ప్రస్తావించగా... ఉద్యోగంలో నుంచి తీసేయాలని ఆర్వోకు చెప్పలేదని సమాధానమిచ్చారు. ఆయన ఎందుకు అలా అన్నారో తనకు తెలియదన్నారు. సదరు మహిళా ఉద్యోగిని కూడా ఎందుకు అలా మాట్లాడిందో తనకు తెలియదని.. రెండు రోజుల్లో విచారణ చేసి, చర్యలు తీసుకుంటామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement