విజయనగరం ఉత్సవాలపై కలెక్టర్‌ సమీక్ష | - | Sakshi
Sakshi News home page

విజయనగరం ఉత్సవాలపై కలెక్టర్‌ సమీక్ష

Published Thu, Oct 3 2024 12:48 AM | Last Updated on Thu, Oct 3 2024 12:48 AM

విజయనగరం ఉత్సవాలపై  కలెక్టర్‌ సమీక్ష

మూడు రోజులపాటు లేబర్‌ హాలీడే

ప్రకటించే అవకాశం

విజయనగరం అర్బన్‌: ఉత్సవ నిర్వహణ కమిటీతో కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తన చాంబర్‌లో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయనగరం ఉత్సవాలు, అమ్మవారి పండగకు లక్షలాదిమంది వచ్చే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఉండేందుకు, భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆ మూడు రోజులపాటు లేబర్‌ హాలీడే ప్రకటించాలన్న విషయంపై చర్చించారు. హోటళ్లు, సంస్థలు, షాపుల్లో పనిచేసే కార్మికులు, ఇతర ఉద్యోగులను ఉత్సవాల్లో భాగస్వాములను చేసే ఉద్దేశంతో ఆ మూడు రోజులపాటు సెలవు ఇవ్వాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. ఆహార పదార్థాలకు ఇబ్బంది పడకుండా భారీ ఎత్తున ఫుడ్‌ ఫెస్టివల్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో ఎస్‌.డి.అనిత, సీపీఓ పి.బాలాజీ, డీఆర్‌డీఏ పీడీ ఎ.కల్యాణచక్రవర్తి, జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, డీపీఓ శ్రీధర్‌రాజా పాల్గొన్నారు.

రక్తదాన ‘సాధన’కు

జాతీయస్థాయి గుర్తింపు

నెల్లిమర్ల: రక్తదాన శిబిరాల నిర్వహణ, ఆపద సమయాన రక్తదానం చేసి ఆదుకుంటున్న జరజాపుపేటకు చెందిన సాధన యువజన సంఘం సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సంఘ అధ్యక్షుడు, 63 సార్లు రక్తదానం చేసిన పోలుబోతు దుర్గాప్రసాద్‌కు రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌లో నిర్వహించిన జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ అతుల్‌ గో యల్‌ బుధవారం ప్రశంసాపత్రాన్ని అందజేశా రు. 14 సంవత్సరాలుగా రక్తదాన కార్యక్రమాల కు సంఘం చేస్తున్న కృషిని కొనియాడారు. జాతీయ సదస్సులో పోలుబోతు దుర్గప్రసాద్‌ మాట్లాడుతూ సాధన యువజన సంఘం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆపదలో ఉన్నవారి ని ఆదుకునేందుకు రక్తదానం చేస్తున్నామన్నా రు. ఆ కృషి గ్రామస్థాయి నుంచి నేడు జాతీయ స్థాయిలో పేరుతెచ్చి పెట్టిందన్నారు. గుర్తింపు రావడంపై సంఘ సభ్యులు పసుమర్తి వెంకటరమణ, బెల్లాన వెంకటరావు, తుమ్ము అశోక్‌, మద్దిల కళ్యాణ్‌ సత్యవతి, అవునాపు అప్పలరాజు, మద్దిల రాంబాబు, పోలుబోతు భాస్కర్‌, ఉపాధ్యాయులు పి.రామారావు, కడలి ప్రకాశ్‌ రావు, బొడ్డేపల్లి రామకృష్ణారావు, గ్రామ యువత ఆనందం వ్యక్తంచేశారు.

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

విజయనగరం టౌన్‌: పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా స్థానిక మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి ఆలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి వైష్ణవీ కళాక్షేత్రం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆద్యంతం ఆహూతులను ఆకట్టుకున్నాయి. స్థానిక రైల్వేస్టేషన్‌ వద్దనున్న వనంగుడి ఆవరణలో అభినయప్రియ నర్తన నాటకశాలకు చెందిన ఎం.సాయిసుప్రియ ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అలరించాయి.

టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి

తగరపువలస: విజయనగరం జిల్లా డెంకాడ మండల పరిధి జొన్నాడ టోల్‌ప్లాజా వద్ద బుధవారం సాయంత్రం జరిగిన కొట్లాటలో పలువురు గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ నుంచి విజయనగరం వైపు వెళ్తున్న మ్యాక్సీ క్యాబ్‌ యజమాని నక్కా సురేష్‌ టోల్‌ ఫీజు చెల్లించకుండా ద్విచక్రవాహనాలు వెళ్లే దారిలో వెళ్తుండగా టోల్‌ కార్మికుడు లొడగల సురేష్‌ వాహనం ఫొటో తీశాడు. దీంతో వాహనం ఆపి వెనక్కి వచ్చిన నక్కా సురేష్‌ ఫొటో ఎందుకు తీశావని ప్రశ్నించగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా కొట్లాటకు దారితీసింది. దీంతో మరికొంత మంది మ్యాక్సీ కాబ్‌ సిబ్బంది ఈ గొడవలో పాల్గొన్నట్టు తెలిసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నక్కా సురేష్‌ను విజయనగరం ఆస్పత్రికి, లొడగల సురేష్‌ను సంగివలస అనిల్‌ నీరుకొండ ఆస్పత్రికి తరలించారు. టోల్‌ప్లాజాకు చెందిన సాయి, ఈశ్వరరావు, చిన్ని, ధనరాజ్‌ కూడా గాయపడ్డారు. భీమిలి సీఐ బి.సుధాకర్‌ సంఘటన స్థలానికి చేరుకుని ఇరువైపులా కేసులు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement